స్వాతంత్య్రం... ఎంతో మంది త్యాగ ఫలితమే - మాజీ ఎంపీ నామ
ఖమ్మం బ్యూరో చీఫ్,తెలంగాణ ముచ్చట్లు:
భారతదేశానికి స్వాతంత్య్రం ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితమని బీఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రిటిష్ పాలకుల చేతుల్లో బందీ అయిన మన దేశాన్ని విముక్తి చేయడానికి స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు మరువలేనివని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టడానికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆ పోరాట వీరులు, జాతీయ ఉద్యమ నాయకుల దేశభక్తి వల్లే మనకు స్వాతంత్య్రం లభించిందని నామ పేర్కొన్నారు. తెల్లదొరల బానిసత్వపు సంకెళ్ల నుంచి యావత్తు భారతజాతికి స్వేచ్ఛను అందించిన ఈ శుభదినం మన అందరికీ గర్వకారణమని అన్నారు.
కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటానికి నాటి స్వాతంత్య్ర పోరాటమే స్ఫూర్తి అని ఆయన అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన మహనీయుల ఆత్మబలిదానాలను స్మరించుకోవడం, వారి జీవిత గాథలను మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నామ తెలిపారు.


Comments