టీ-ఫైబర్ ప్రాజెక్టుకు వడ్డీ రహిత రుణం రూ.1779 కోట్లు అందించండి

నెల‌కు రూ.300కే రాష్ట్రంలోని 93 ల‌క్ష‌ల గృహాల‌కు ఫైబ‌ర్ క‌నెక్ష‌న్‌ ల‌క్ష్యం..

టీ-ఫైబర్ ప్రాజెక్టుకు వడ్డీ రహిత రుణం రూ.1779 కోట్లు అందించండి

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

 * ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశను భారత్ నెట్ – 3 ఆర్కిటెక్చర్ కు మార్చే డీపీఆర్‌ను ఆమోదించండి*

* కేంద్ర టెలికం, క‌మ్యూనికేష‌న్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి*

తెలంగాణ‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని 63 ల‌క్ష‌ల గృహాలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని 30 ల‌క్ష‌ల గృహాల‌కు నెల‌కు రూ.300కే ఫైబ‌ర్ క‌నెక్ష‌న్‌ క‌ల్పించాల‌ని ల‌క్ష్యంగా పెట్ట‌కున్న‌ట్లు కేంద్ర టెలికం, క‌మ్యూనికేష‌న్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఢిల్లీలో శుక్ర‌వారం సాయంత్రం క‌లిశారు. 

టీ-ఫైబ‌ర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా కనెక్టివిటీని కల్పించడం తమ ఉద్దేశ‌మ‌ని కేంద్ర మంత్రి సింధియాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వివ‌రించారు. 65,500 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ (గవర్నమెంట్ టూ గవర్నమెంట్), జీ2సీ (గవర్నమెంట్ టూ సిటీజన్) కనెక్టివిటీ కల్పించడంతో పాటు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించాలని త‌మ‌ ప్రభుత్వం యోచిస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. 

రాష్ట్రంలో 300 రైతు వేదికలకు టీ-ఫైబర్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంద‌ని, సాంఘిక సంక్షేమ పాఠశాలలకూ టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి సింధియా దృష్టికి తీసుకెళ్లారు. రూ. 1779 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించిన టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 530 కోట్లను వివిధ‌ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించిందని కేంద్ర మంత్రి సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. మొత్తం పెట్టుబడి వ్యయం రూ. 1,779 కోట్లను యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఎఫ్ఓ) ద్వారా వ‌డ్డీ లేకుండా దీర్ఘ‌కాలిక రుణంగా ఇవ్వాల‌ని కేంద్ర మంత్రి సింధియాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. 

 జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వ‌ర్క్ (ఎన్ఓఎఫ్ఎన్) మొదటి దశ మౌలికసదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి సకాలంలో అందించాలని కేంద్ర మంత్రి సింధియాను ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశ లైనియర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నడుస్తుంటే... మిగితా ప్రాంతాల్లో రింగ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా టీ-ఫైబర్ నడుస్తోందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఈ రీత్యా నెట్ వ‌ర్క్‌ సమర్థ నిర్వహ‌ణ‌, వినియోగం కోసం సకాలంలో ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశ మౌలిక సదుపాయాలకు అందించాలని ప్రతిపాదించారు.  

ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశను భారత్ నెట్ – 3 ఆర్కిటెక్చర్ కు మార్చడానికి గతేడాది అక్టోబరులో కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్ర ప్ర‌భుత్వం డీపీఆర్ ను పంపించిందని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. ఆ డీపీఆర్‌ను త్వరగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. భారత్ నెట్ – 3 ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాల పౌరులకు ఈ-గవర్నెన్సును అందించగలుగుతామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాల కల్ప‌న‌కు ఉద్ధేశించిన భారత్ నెట్ ఉద్యమి పథకాన్ని టీ-ఫైబర్ కు వర్తింపజేయాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .