వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బి. బాలకృష్ణ, సీసీఎస్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం రాపర్తి నగర్ వద్ద వాహన తనిఖీల సందర్భంగా ఒక అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా, బంగారు, వెండి ఆభరణాలు కనుగొనబడినాయి. విచారణలో అతను మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నల్లగుండితండాకు చెందిన గుగులోత్ నవీస్ అని, వృత్తి ప్రైవేట్ ఉద్యోగం అని వెల్లడించాడు.
సమాచారం ప్రకారం, నవీస్ 2024 డిసెంబర్‌లో ఖమ్మం బైపాస్ రోడ్‌లోని ఎస్ఆర్సి టవర్స్ అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్ తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించాడు. అదే సంవత్సరం ఆగస్టులో కుషాయిగూడ ప్రాంతంలో ఒక స్కూటీ దొంగతనం చేసి, డిసెంబర్‌లో మేడ్చల్‌లో రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. అంతేకాదు, హన్మకొండలో కూడా ఓ ఇంట్లో చోరీ చేసినట్లు అంగీకరించాడు.
దీంతో పాటు, 2016 నుండి వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్ వంటి జిల్లాల్లో అనేక దొంగతనాలకు పాల్పడినట్లు అతను ఒప్పుకున్నాడు.
పోలీసులు అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, పూజ సామాగ్రిని రికవరీ చేశారు. రికవరీ చేసిన మొత్తం వస్తువుల విలువ దాదాపు 18 లక్షలు ఉంటుందని తెలిపారు.
ఈ కేసు చేధనలో కీలక పాత్ర పోషించిన ఖమ్మం టూ టౌన్ పోలీసులు, సీసీఎస్ ఏసీపీని పోలీస్ కమిషనర్ ప్రశంసించారు.


Comments