నియోజకవర్గ అభివృద్ధికి 15 కోట్లు మంజూరు.
అశ్వారావుపేట కొత్త మున్సిపాలిటీకి పలు అభివృద్ధి పనులు చేపడతాం - ఎమ్మెల్యే జారె
అశ్వారావుపేట, సెప్టెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించారు. గతంలో నిర్మించబడిన 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేసి ఇండ్లు అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అశ్వారావుపేట కొత్త మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 15 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
ఈ నిధులతో నూతన మున్సిపాలిటీ భవనం, ఆధునిక మున్సిపల్ మార్కెట్, పబ్లిక్ టాయిలెట్లు, ట్యాంక్ బండ్ అభివృద్ధి, దొంతికుంట చెరువు అభివృద్ధి, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడతామని వివరించారు. అదేవిధంగా అశ్వారావుపేట, దమ్మపేట, మందలపల్లి, చండ్రుగొండ బస్ స్టాండ్ల అభివృద్ధి కోసం కూడా నిధులు కేటాయించామని తెలిపారు.
నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త బీటీ రోడ్లు, రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు గ్రావెల్ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి కూడా నిధులు సమీకరించామని, త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, ఎమ్మార్వో రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, పలు శాఖల అధికారులు, మండల నాయకులు జూపల్లి ప్రమోద్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


Comments