ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు.....
రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి
-నేడు జరిగే క్యాబినెట్ సమావేశంలో రైతన్నలకు శుభవార్త
-కూసుమంచి మండలంలో పర్యటించి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, లబ్ధిదారులకు సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను అందజేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మొదటి విడతలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
శనివారం మంత్రి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి తో కలిసి కూసుమంచి మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి కూసుమంచి, నేలకొండపల్లి మండల లబ్ధిదారులకు సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను అందజేశారు.
ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. నిధులు 15 లక్షలతో కూసుమంచి మండలం లోక్యా తండా గ్రామంలో చేపట్టిన సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు, కోక్యతండా గ్రామంలో 20 లక్షలతో, లింగారం తండాలో 19 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
అనంతరం కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో నేలకొండపల్లి మండలానికి చెందిన మొత్తం (42) మంది లబ్ధిదారులకు 16 లక్షల ఒక వేయి ఐదు వందలు, కూసుమంచి మండలానికి చెందిన మొత్తం (64) మంది లబ్ధిదారులకు 18 లక్షల 80 వేల 500 రూపాయలు సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో పేదలు కుటుంబంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మార్పు కావాలని పేదలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది ఇండ్లు కావాలని దరఖాస్తు చేశారని, ఇప్పటి వరకు 64 లక్షల దరఖాస్తుల సర్వే ఈ యాప్ ద్వారా పూర్తి చేసామని, మిగిలిన దరఖాస్తుల సర్వే మరో నాలుగు రోజులలో పూర్తి చేస్తామని అన్నారు. గతంలో వివిధ దశలలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా సంక్రాంతి లోపు పంపిణీ చేస్తామని, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని అన్నారు.
గ్రామాల్లో త్రాగునీటి సరఫరాకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రైతులు, యువకులు, మహిళల సంక్షేమం కోసం ఇందిరమ్మ రాజ్యం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. నేడు జరిగే క్యాబినెట్ సమావేశంలో రైతన్నలకు శుభవార్త ఉంటుందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, ఇర్రిగేషన్ ఎస్ఇ వెంకటేశ్వర రావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, కూసుమంచి ఎంపిడివో వేణుగోపాల్ రెడ్డి, ఇంచార్జ్ తహసీల్దార్ కరుణశ్రీ, ప్రజా ప్రతినిదులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments