సామాజిక సేవలో కొత్త అధ్యాయం రౌడీషీటర్లకు రాచకొండ పోలీసుల అవకాశం
మల్కాజ్గిరి, నవంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
సాధారణంగా రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై పోలీసులు నిఘా ఉంచుతారు. అయితే ఈ సారి సాంప్రదాయ పర్యవేక్షణ పద్ధతులకు భిన్నంగా, వారిని కేవలం ఇంటికే పరిమితం చేయకుండా సమాజంలో మంచి మార్పు దిశగా తీసుకెళ్లేందుకు రాచకొండ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.సంస్కరణకు సిద్ధంగా ఉన్న హిస్టరీ షీటర్లను ఎంపిక చేసి, వారిని ప్రజా జీవితం – సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగస్వాముల ను చేస్తున్నారు. ఈ మేరకు ఉప్పల్, ఎల్బీనగర్, ఈసీఐఎల్ వంటి రద్దీ జంక్షన్లలో వారిని ట్రాఫిక్ నిర్వహణలో పాల్గొనేలా చేశారు.దారి తప్పిన గత జీవితం నుండి బయటకు వచ్చి, కొత్త మార్గంలో నడవాలని సంకల్పించిన ఈ హిస్టరీ షీటర్లు వలంటీర్లు, ట్రాఫిక్ సిబ్బందితో కలిసి వాహనాల రాకపోకలు నియంత్రిస్తూ, ప్రయాణికులకు దారి చూపుతున్నారు.
కుషాయిగూడ పోలీస్ ఆధ్వర్యంలో చేపట్టిన ట్రాఫిక్ నియంత్రణ–అవగాహన కార్యక్రమంలో 20 మంది రౌడీషీటర్లు పాల్గొన్నారు. అలాగే ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుండి 20 మంది, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ నుండి 20 మంది హిస్టరీ షీటర్లు స్వచ్ఛందంగా సేవలందించారు.“గతంలో చేసిన తప్పులు గుర్తున్నాయి… ఇప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం రావడం గర్వంగా ఉంది” అని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆనందం వ్యక్తం చేశారు. సమాజం తమను తిరస్కరించిన స్థితి నుండి, ప్రజలకు సేవ చేసే స్థాయికి రావడం జీవితంలో కొత్త అధ్యాయమని వారు పేర్కొన్నారు.ఇలాంటి సంస్కరణాత్మక కార్యక్రమాలను మరింత విస్తరించేలా, పోలీస్ సర్వైలెన్స్‌లో ఉన్న మరికొందరినీ ప్రజా సేవల్లో భాగం చేయాలని రాచకొండ పోలీసులు ప్రణాళికలు చేస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. సమాజంలో మంచి మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు


Comments