ఆయిల్ పామ్ సాగు విస్తరణ, లక్ష్యంపై సమీక్షా సమావేశం
జిల్లా వారీగా ప్రగతిని సమీక్షించిన చైర్మన్ జంగా రాఘవరెడ్డి
-మార్చి 2026లోపు నిర్దేశిత లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశాలు
హైదరాబాద్,అక్టోబర్6(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు విస్తరణపై సమీక్షా సమావేశం సోమవారం దృశ్యమాధ్యమం (జూమ్) ద్వారా జరిగింది. ఈ సమావేశానికి ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అధ్యక్షత వహించారు. ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీ జోన్ పరిధిలోని ఎనిమిది జిల్లాలకు చెందిన జిల్లా ఇన్‌చార్జీలు, ఫీల్డ్ ఆఫీసర్లు, ప్లాంటేషన్ మానిటరింగ్ అధికారులు, నర్సరీ ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.సమావేశంలో జిల్లాల వారీగా సాగు విస్తరణ లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన ప్రగతిని సమీక్షించారు. మార్చి 2026 నాటికి నిర్ధేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలని చైర్మన్ సూచించారు.
చైర్మన్ జంగా రాఘవరెడ్డి సూచనలు...
ప్రతి జిల్లా ఇన్‌చార్జీ తమ పరిధిలోని మండలాల వారీగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతుల వివరాలు..రైతు పేరు, సాగు ఎకరాలు, ఫోన్ నంబరు, చిరునామా సేకరించి, రెండు రోజులలో ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.
రైతులందరినీ వాట్సప్ గ్రూప్‌లలో చేర్చి, ఆయిల్ పామ్ సాగుకు సంబంధించిన సాంకేతిక సమాచారం, ఆధునిక పద్ధతులను నిరంతరం పంపిణీ చేయాలని సూచించారు. రైతులు నర్సరీకి వచ్చి మొక్కలు ఎంపిక చేసుకున్న వెంటనే వాటిని తోటల వరకు అందించడం ఫీల్డ్ ఆఫీసర్ల బాధ్యత అని స్పష్టం చేశారు. రైతులు కోరిన రోజే మొక్కలను అందించాలన్నారు.
ఫీల్డ్ ఆఫీసర్లు తమకు కేటాయించిన టార్గెట్లను పూర్తి చేయకపోతే, వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. నర్సరీ ఇన్‌చార్జీలు మొక్కల పెంపకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, మట్టి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ప్రభుత్వ జీవో ప్రకారం ఆయిల్ పామ్ తోటలలో కరెంటు స్తంభాలు తొలగించాలన్నారు. ఈ ప్రక్రియలో సమస్యలు ఎదురైతే జిల్లా ఇన్‌చార్జీలు సంబంధిత విద్యుత్ అధికారులను సంప్రదించి పరిష్కరించాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్త లక్ష్యం:
ఈ సందర్భంగా సచివాలయంలో జరిగిన ఆయిల్ పామ్ కంపెనీల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని నిర్ణయించామని, అందరూ సమిష్ఠిగా కృషి చేయాలని సూచించారని చైర్మన్ తెలిపారు.
ఫీల్డ్ ఆఫీసర్లు, జిల్లా మేనేజర్లు రైతుల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని, వారి సమస్యలకు సమాధానాలు అందించాలన్నారు. రైతు తోటలు సందర్శించినప్పుడు పరిశీలన వివరాలను రైతు డైరీలో రాసి, సంతకం చేసి ప్రతి నెలా హెడ్ ఆఫీస్‌కి పంపించాలని సూచించారు.
ఆయిల్‌ఫెడ్‌పై ప్రతికూల వార్తలు వచ్చిన వెంటనే సంబంధిత మండల ఫీల్డ్ ఆఫీసర్లు స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగులో విజయవంతమైన రైతుల విజయగాథలను వాట్సప్ గ్రూప్‌లలో పంచాలని సూచించారు.ఆయిల్‌ఫెడ్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసే వారిని సమర్థించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారిని తక్షణమే సేవల నుండి తొలగిస్తామని చైర్మన్ జంగా రాఘవరెడ్డి హెచ్చరించారు.


Comments