మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.
- సిబ్బందిపై నిఘా.. రికార్డుల సోదాలు.
- పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి.
సత్తుపల్లి, మార్చి 31 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణం మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన తనిఖీలు గంటల పాటు కొనసాగాయి. కార్యాలయంలో ఉన్న సిబ్బందిని బయటకు అనుమతించకుండా నియంత్రణలు విధించి, కీలక విభాగాల రికార్డులను పరిశీలించారు. నగదు లావాదేవీలు, పన్ను వసూళ్లు, ఫైళ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. కొంతకాలంగా అందుతున్న ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ మాట్లాడుతూ, ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఉద్యోగుల పనితీరును కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల వసూళ్లలో లోపాలున్నాయన్న అనుమానాలపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. అధికారులు పలు విభాగాల రికార్డులను సవివరంగా పరిశీలించగా, అవసరమైతే సంబంధిత సిబ్బందిని విచారణకు పిలిపించే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, మున్సిపల్ కమిషనర్ కె. నరసింహరావు నివాసంలో కూడా ఏసీబీ అధికారులు
సోదాలు నిర్వహించారు. ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొనగా, స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


Comments