మహాలక్ష్మి పథకం మహిళలకు వరంగా మారింది
_కుషాయిగూడలో కార్యక్రమం
– మహిళల పొదుపు రూ.10,000 కోట్లకు చేరింది
_బస్సుల్లో ప్రయాణంగణనీయంగాపెరిగింది
కుషాయిగూడ, మార్చి 31 (తెలంగాణముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపో పరిధిలోని ఈసీఐఎల్ బస్టాండ్‌లో మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం మహిళలకు వరంగా మారిందన్నారు. మహిళల సాధికారతను పెంపొందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.కుషాయిగూడ డిపో మేనేజర్ వేణుగోపాల్ మాట్లాడుతూ, గతంలో రవాణా ఖర్చుల కోసం నెలకు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు ఖర్చు చేసే మహిళలు, విద్యార్థినులు, కూలీలు ఇప్పుడు ఆ మొత్తాన్ని పొదుపు చేసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పొదుపు చేసిన మొత్తం రూ.10,000 కోట్లకు చేరుకోవడం ఈ పథకం విజయాన్ని సూచిస్తోందన్నారు.మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. పథకం ప్రారంభానికి ముందు 40 శాతం ఉన్న మహిళల వాటా ప్రస్తుతం 67 శాతానికి పైగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రతిరోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలు ఈ పథకం ద్వారా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి, కీర్తి కుమార్, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య, రాజేష్ నాయుడు, వెల్ఫేర్ మెంబర్ రాములు, మహేందర్ రెడ్డి, ఎస్బీఐ భగవంతం, డ్రైవర్ ఉపేందర్, కండక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.


Comments