వేముల ఘటనపై అడ్డాకులలో అఖిలపక్ష నిరసన
నిందితులను వెంటనే చట్టపరంగా శిక్షించాలి
-- అఖిలపక్ష నాయకుల డిమాండ్
అడ్డాకుల డిసెంబర్19(తెలంగాణ ముచ్చట్లు):
మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో ఎన్నికల ఫలితాల అనంతరం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ సందర్భంగా దళిత యువతి మాల ప్రవళికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ అడ్డాకుల మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీలు, వివిధ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ నిరసన కార్యక్రమాన్ని ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు మునుగల నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ, దళిత సంఘాలు ఎంఆర్‌పీఎస్, మాల మహానాడు, అలాగే బహుజన సమాజ పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బహుజన సమాజ పార్టీ మండల అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ.. నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటన అగ్రకుల యువతికి జరిగితే ప్రభుత్వ స్పందన ఎలా ఉండేదో ప్రజలు ఆలోచించాలని, దళిత యువతిపై జరిగిన ఈ దాడి విషయంలో ప్రభుత్వ వైఖరి బాధాకరంగా ఉందని అన్నారు. ఇప్పటివరకు ఉత్తర భారత ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పత్రికల్లో చదివేవారమని, కానీ మనకు సమీప గ్రామంలోనే ఇలాంటి దారుణం జరగడం అత్యంత కలచివేసిందని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకుడు ఆంజనేయులు మాట్లాడుతూ నిందితులను వెంటనే శిక్షించి, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రస్థాయి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.మాల మహానాడు మండల అధ్యక్షుడు రాఘవేంద్ర మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులు తక్షణమే ఆగాలని, నిందితులకు అత్యంత కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దళితులపై వివక్ష, దాడులు ఎంతకాలం కొనసాగుతాయో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు మునుగల నరేష్, మండల కార్యదర్శి మచ్చానీ ప్రశాంత్, నాయకులు స్టీఫెన్, సురేష్, బుజ్జి, ప్రేమ్ కుమార్, బహుజన సమాజ పార్టీ మండల అధ్యక్షుడు ప్రసాద్, నాయకుడు నరాసింహ, మాల మహానాడు మండల అధ్యక్షుడు రాఘవేంద్ర, సభ్యులు లక్ష్మీనారాయణ, నరేందర్, ప్రకాశ్, నరేష్, సమాచార హక్కు చట్టం మండల అధ్యక్షుడు పాతిరి నాగవర్ధన్, అలాగే ఖాజా మొయినుద్దీన్, నిరంజన్, రేవంత్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments