ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు
ప్రభుత్వ లాంఛనాలతో ఘట్కేసర్ స్మృతి వనంలో అంతిమ సంస్కారాలు
మేడ్చల్, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ గేయరచయిత, కవి అందెశ్రీ అంత్యక్రియలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించి ముగించారు. తెలంగాణ ఉద్యమానికి ఆత్మగా నిలిచిన అందెశ్రీకి ప్రభుత్వం ఘట్కేసర్ స్మృతి వనంలో అర్ధ ఎకరం (ఇరవై గుంటలు) స్థలం కేటాయించింది.హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి, అవుటర్ రింగ్ రోడ్డును ఆనుకుని మేడ్చల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన స్మృతి వనంలో వేలాదిమంది అభిమానులు, కవులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
అంతిమయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుగ్గిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరాం, విమలక్క, పాశం యాదగిరి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, కీసర ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమానికి ఆత్మగా నిలిచిన అందెశ్రీని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు. ఆయన రచించిన ‘నిప్పుల వాగు’ పుస్తకం తెలంగాణ గర్వకారణం. ప్రతి గ్రంథాలయంలో ఈ గ్రంథాన్ని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటాను. అందెశ్రీకి భారతరత్న పురస్కారం దక్కేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడతాను,” అన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులు, అభిమానులు, కవులు, ప్రజలు అశ్రునయనాలతో “జై తెలంగాణ” నినాదాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు.


Comments