ఆచార్య సేవగా – భగవత్, భాగవత సేవ
శ్రీ పశుపతినాథ్ దేవస్థానం అర్చకుడు శ్రీ సదానిరంజన్‌కు సన్మానం
ఎల్కతుర్తి నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో “ఆచార్య సేవగా – భగవత్, భాగవత సేవ” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
శ్రీ భగవద్రామానుజాచార్యుల ఉపదేశాల స్ఫూర్తితో, “మాధవసేవగా – సర్వప్రాణి సేవ” భావాన్ని ఆచరణలో పెట్టడం లక్ష్యంగా వికాస తరంగిణి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు శ్రీ సిద్ధాంతి సదానిరంజన్ గారిని ఘనంగా సన్మానించారు. సమానత్వంతో కూడిన ధార్మిక జీవనాన్ని ప్రజల్లో విస్తరింపజేసిన దయాసముద్రుడు శ్రీ రామానుజాచార్యుల బోధనలతో ప్రేరణ పొందిన ఈ కార్యక్రమం విశేషంగా నిలిచింది.
108 దివ్యదేశాలతో కూడిన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల దివ్య విగ్రహం స్థాపన, శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరగడం విశిష్ట ఘట్టంగా పేర్కొన్నారు నిర్వాహకులు.
ఈ మహాకార్యాన్ని స్మరించుకుంటూ, 2025 అక్టోబర్ 22 నుండి 25 వరకు శ్రీరామనగర్‌లో జరిగే 69వ తిరునక్షత్ర మహోత్సవాల సందర్భంలో ఈ సేవా కార్యక్రమాన్ని వికాస తరంగిణి సంకల్పించింది.
కార్యక్రమం ప్రధాన ఉద్దేశం — శాస్త్రోక్త పద్ధతిలో ఆరాధన జరగని చిన్న దేవాలయాల్లో భగవత్సేవ, భాగవతసేవ ను సక్రమంగా అందించడం. ఆగమ శాస్త్రాల ప్రకారం ఆరాధనలో అర్చకుల పాత్ర ఎంతో ముఖ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్రీయ, శాస్త్రోక్త ఆరాధనను ప్రజలకు చేరవేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీ సిద్ధాంతి సదానిరంజన్, శివాలయ కమిటీ చైర్మన్ గంజి భావనఋషి, కడెం రమేష్, సుందర్ రావు, రాజేందర్, రోజా, అరుణ, శోభా, కవితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments