ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ మాత్రమే
కరుణాపురం క్రీస్తు జ్యోతి ఆశ్రమంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ధర్మసాగర్ మండలం కరుణాపురం క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఎంతో ఆధ్యాత్మికమైన వాతావరణంలో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి,మరియు వారి సతీమణి వినయరాణి హాజరయ్యారు.
ప్రత్యేక ప్రార్థనలు, శాంతి సందేశం
చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత కడియం శ్రీహరి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రేమ, త్యాగం, దాతృత్వం, మరియు సహనం అనే సుగుణాలను ఆచరించడం ద్వారా మానవాళి శ్రేయస్సు సాధ్యమవుతుంది. ఏసుక్రీస్తు జీవితం అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది” అని అన్నారు.
భారతదేశం సర్వమత సమ్మేళనం
“భారతదేశం సర్వ మతాల సమ్మేళనానికి చిహ్నం. అందరూ ఒకరిని ఒకరు ప్రేమించాలి, శాంతి మార్గంలో నడవాలి, పేదవారికి తోడ్పాటు అందించాలి” అని ఆయన క్రీస్తు బోధనలు గుర్తుచేశారు. ప్రపంచంలో అత్యధికమంది శాంతి కోసం జరుపుకునే పండుగగా క్రిస్మస్‌కు విశిష్టమైన ప్రాముఖ్యత ఉందని అన్నారు.
కరుణాపురం చర్చి ప్రత్యేకత
కరుణాపురం క్రిస్తుజ్యోతి ప్రార్థనా మందిరం ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా పేరుపొందిందని, ఈ ప్రాంత ప్రజలకు ఇది గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ చర్చి ప్రాంగణాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం “ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. మత పరంగా లేదా సామాజికంగా ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో క్రిస్తుజ్యోతి ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు పాస్టర్ పాల్సన్ రాజ్, ఇతర పాస్టర్లు, క్రైస్తవ సోదరులు, ప్రజాప్రతినిధులు, మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments