క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉంటా
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):
క్రైస్తవుల సంక్షేమం,అభివృద్ధికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు.మంగళవారం వనపర్తి పట్టణంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని, అందులో భాగంగానే క్రిస్మస్ వేడుకల నిర్వహణకు రూ.2 లక్షలు కేటాయించిందని తెలిపారు.అలాగే క్షేత్రస్థాయిలోని చర్చిలకు రూ.30 వేల చొప్పున మంజూరు చేసిందని పేర్కొన్నారు. సంబంధిత నిబంధనలను పాటిస్తూ ఆయా నిధులను బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకొని వినియోగించుకోవాలని నిర్వాహకులకు సూచించారు.వనపర్తి నియోజకవర్గ పరిధిలోని చర్చిల అభివృద్ధికి తాను పూర్తిస్థాయిలో సహకారం అందిస్తానని, చర్చిలకు అవసరమైన పనుల వివరాలతో నివేదికలు సిద్ధం చేసి అందజేయాలని నిర్వాహకులను కోరారు.అలాగే రెండు ఎకరాల విస్తీర్ణంలో క్రైస్తవ సంఘ భవనం నిర్మాణం, గ్రేవ్‌యార్డ్ ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చర్యలు చేపడతానని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారి అఫ్జలుద్దిన్, ఉప కలెక్టర్ శ్రావ్య, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, క్రైస్తవ సంఘ నాయకులు బెంజిమెన్, జానప్ప జాన్, రాజు, గోర్లు అనిల్, గంధం బాలరాజు, వేణుశ్రీకాంత్, తిమోతి తదితరులు పాల్గొన్నారు.


Comments