సింగరేణి నూతన జీఎం కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం: భట్టి
- మారుతున్న కాలానికి అనుగుణంగా సింగరేణి రూపాంతరం.
- ప్రపంచంతో పోటీ పడే సంస్థగా తీర్చిదిద్దుతాం.
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
సత్తుపల్లి, డిసెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక పట్టణంలో నిర్మించిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నూతన జీఎం కార్యాలయ భవనాన్ని సింగరేణి సీఎండీ కృష్ణ భాస్కర్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌లతో కలిసి డిప్యూటీ సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, 137వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్మికుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. విశాలంగా నిర్మించిన నూతన జీఎం కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం గర్వకారణమని చెప్పారు. ప్రస్తుతం సింగరేణి సంస్థలో 45 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 40 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంస్థగా సింగరేణి నిలుస్తోందన్నారు.
సింగరేణి మరిన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచే దిశగా ప్రభుత్వం విధానాలు రూపొందిస్తోందని తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ మైనింగ్ వైపు కూడా సింగరేణి దృష్టి సారించాలని సూచించారు. గ్లోబల్ స్థాయిలో సింగరేణి జెండా ఎగరాలని ఆకాంక్షించారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో భాగంగా ప్రయోగాత్మకంగా ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడతామని, రాజస్థాన్ ప్రభుత్వంతో 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఎంఓయూ కుదిరిందన్నారు. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులు ఇతరుల చేతికి వెళ్లకుండా కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గుతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గు సరఫరా చేస్తూ సింగరేణి కాలరీస్ కంపెనీ కీలక పాత్ర పోషిస్తున్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు వ్యాపార అవసరాలకూ సింగరేణి బొగ్గు ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్నారు.
గతంలో ప్రభుత్వ రంగానికే పరిమితమైన బొగ్గు ఉత్పత్తి రంగంలో, కాలక్రమేణా వచ్చిన మార్పులతో ప్రైవేటు సంస్థలకు కూడా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. బొగ్గు గనుల ఆక్షన్లలో ప్రైవేటు సంస్థలు పాల్గొనడంతో పాటు, విదేశాల నుంచి బొగ్గు దిగుమతులకు కూడా అవకాశం ఉండటంతో పోటీ పెరిగిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సింగరేణి నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
నాణ్యమైన బొగ్గును మార్కెట్ ధరకు సరఫరా చేస్తూ, పోటీని తట్టుకునేలా ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యతను పెంచుకోవాలని సూచించారు. మైనింగ్ రంగంలో సింగరేణికి ఉన్న అనుభవం మరే సంస్థకూ లేదని పేర్కొన్న డిప్యూటీ సీఎం, బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయిలో పోటీ పడే సంస్థగా సింగరేణిని తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ, సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధుల కింద సత్తుపల్లి ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన కిష్టారం, వెంగళరావు నగర్, ఎన్టీఆర్ కాలనీల్లో కాలుష్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇళ్లు కోల్పోయిన 40 కుటుంబాలకు నూతన ఇళ్లను నిర్మించామని, మరో 200 ఇళ్ల నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. కిష్టారం గ్రామ ప్రజలకు ఆర్ఆర్ ప్యాకేజీ అందించి పునరావాసం కల్పించాలని కోరారు.
అంతకుముందు సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిప్యూటీ సీఎం కేక్ కట్ చేశారు. అనంతరం జీవీఆర్ ఓపెన్ కాస్ట్ గనిని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, విద్యుత్ శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, సింగరేణి అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Comments