కల్లూరులో అభివృద్ధి పనులు – బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే
కల్లూరు, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు పట్టణం అభివృద్ధి పనులు, పండుగ ఉత్సవాలు, ప్రజా సమస్యల పరిశీలనతో సందడిగా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో కలిసిపోయారు.
ముందుగా పట్టణంలో షాదీ ఖానాను ప్రారంభించిన మంత్రులు, కొత్త లైబ్రరీ భవనానికి శంకుస్థాపన చేశారు. కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 200 మంది విద్యార్థులకు ఆశా స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నోట్‌బుక్స్, యూనిఫాంలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, విద్యార్థులు కృషి చేసి ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు. రాగమయి దంపతులు చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.
తరువాత కల్లూరు వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో వేలాది మంది మహిళలు, విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం నెలకొని ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజల జీవన స్థాయి మెరుగుపడుతోందని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో భాగంగా ముత్తుగూడెం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవేవద్ద రైతులు కోరిన సర్వీస్ రోడ్ ఏర్పాటును జిల్లా కలెక్టర్ సమక్షంలో పరిశీలించారు. రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యేలు, ఖమ్మం జిల్లా కలెక్టర్, కల్లూరు సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ప్రభుత్వ అధికారులు, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Comments