తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన దీక్ష దివస్
మాజీ ఎంపీ నామ
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
మలి దశ తెలంగాణ ఉద్యమంలో 29 నవంబర్, 2009 తెలంగాణ చరిత్రలో లిఖించదగిన రోజని బిఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. ఆ రోజున ఉద్యమ నేతగా కేసిఆర్ చేపట్టిన "దీక్ష దివస్" ఉద్యమాన్ని మలుపు తిప్పిందన్నారు. రాష్ట్ర సాధన ధ్యేయంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కేసిఆర్, “తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో” అంటూ నినాదంతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ఘనత వారిదన్నారు. తెలంగాణ ప్రజల్ని ఐక్యం చేసి ఏకతాటి మీదకు తీసుకువచ్చిన తెలంగాణ ఉద్యమ సారధి కెసిఆర్, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి నేటితో ఉద్యమ విజయానికి పదిహేనేండ్లు పూర్తయిందన్నారు. మహాత్మ గాంధీ స్పూర్తితో గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రజలను కదిలించి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కెసిఆర్‌ను ఆయన కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు నాడు తెలంగాణ విద్యార్థి లోకం, ఉద్యమకారులు, ఉద్యోగులు, అమరులు నిరంతరం తమ వాణి వినిపించారన్నారు. 15వ లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినపుడు, తాను ఎంపీగా ఉండి తెలంగాణ బిడ్డగా తొలి ఓటు వేసానన్నారు. దీక్ష దివస్ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జరిగే కార్యక్రమాల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని కోరారు.


Comments