టెక్స్‌టైల్ పార్కు భూ నిర్వాసితులకు ఇళ్ల స్థలాల పంపిణీ
-ప్రతి పేద వాడికి విద్య,వైద్యం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
-మంత్రి శ్రీధర్ బాబు

వరంగల్ /గీసుగొండ,తెలంగాణ ముచ్చట్లు:రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి మెరుగైన విద్యా, వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. గీసుగొండ మండలంలోని టెక్స్టైల్ పార్కులో భూ నిర్వాసితులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టెక్స్టైల్ పార్కు ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన భూ నిర్వాసితులకు ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలని ఇస్తున్నామన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం మీరు ఆనాడు భూములు ఇచ్చారని, భూములు ఇచ్చిన వారికి మేలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ముఖ్యమంత్రి దృష్టికి, నా దృష్టికి తీసుకువచ్చాడని తెలిపారు. ఓ పక్క టెక్స్టైల్ పార్కు అభివృద్ధి చేస్తూనే, భూనిర్వాసితుల అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. భూ నిర్వాసితులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం కలెక్టర్ పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా మీ చేతుల మీదుగానే డ్రా పద్ధతిలో స్థలాలు ఇస్తున్నామన్నారు.
ఇందిరమ్మ ఇల్లు పథకం
విధివిధానాల్లో 74 గజాల ఇంటి స్థలం ఉంటేనే ఇల్లు మంజూరు అవుతుంది. కాబట్టి టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు 50 గజాల ఇంటి స్థలం ఉన్నవారికి మరో 25 గజాలు కలిపి 75 గజాలు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం సంతోష కరమైన విషయం అన్నారు. 2022లో వరదల కారణంగా ఇండస్ట్రీలు మునిగాయని ఆ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మహిళలకు ఉచిత బస్సు 200 యూనిట్ల ఉచిత కరెంటు రూ. 500 కే గ్యాస్ పథకాలను అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని నూతన ఆర్థిక విధానాల ద్వారా గాడిలో పెడుతున్నామన్నారు. సన్న వడ్లు పండించే రైతులకు మద్దతు ధర ఇస్తూనే రూ. 500 బోనస్ ఇస్తున్నామన్నారు.
ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై విషపూరితమైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. టెక్స్టైల్ పార్కులో స్థానికులకు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవారికి పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నామని,మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, ప్రణాళిక బద్ధంగా అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని హామీ ఇచ్చారు. టెక్స్టైల్ పార్కులో యంగ్ వన్ కంపెనీ మంత్రి శ్రీధర్ బాబు సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎంపీ కవిత,కెఆర్ నాగరాజు,సిరిసిల్ల రాజయ్య, నిర్మల జగ్గారెడ్డి, బస్వరాజ్ సారయ్య, జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
బ్రాహ్మణ భవనాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
వరంగల్ మహా నగర పాలక సంస్థ 15వ డివిజన్ గొర్రెకుంట లో సుమారు రూ.50 లక్షల రూపాయలతో నిర్మించిన బ్రాహ్మణ భవనాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద, కమిషనర్ అశ్వినీ తానాజీ వాంకడే తదితరులు పాల్గొన్నారు


Comments