డాక్టర్ నిర్లక్ష్యంతో యువకుడి మృతి
కీసర, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు)
కీసర ప్రాంతంలో జరిగిన హృదయ విదారక ఘటన స్థానికులను కలచివేసింది. స్థానిక నితిన్ హాస్పటల్‌లో వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆదివారం బొడ్రాయి పండుగ నేపథ్యంలో బంధువుల ఇంటికి వచ్చిన మహేష్ యాదవ్ (యాదాద్రి జిల్లా పగిడిపల్లి నివాసి) సాయంత్రం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని కీసరలోని నితిన్ హాస్పటల్‌కు తీసుకెళ్లారు.
డాక్టర్లు ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే మహేష్ మాట్లాడలేని స్థితికి చేరాడు. ఆందోళన చెందిన బంధువులు వైద్యుల సూచనలతో నాగారం విజయ్ హాస్పిటల్కి తరలించగా, మార్గమధ్యలోనే మహేష్ మృతి చెందాడు.దీంతో ఆగ్రహానికి గురైన మహేష్ బంధువులు నితిన్ హాస్పటల్ ఎదుట ఆందోళనకు దిగారు. హాస్పటల్‌లోని ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్లు ధ్వంసం చేశారు.పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.బంధువులు డాక్టర్ నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని ఆరోపిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.


Comments