ఫైర్‌స్టేషన్ ముందు రోడ్డుపై ప్రజల ఫైర్
ఆర్‌అండ్‌బి శాఖ నిర్లక్ష్యం… ప్రమాదంలో ప్రజల ప్రాణాలు!
స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 01 తెలంగాణ ముచ్చట్లు
స్టేషన్‌ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి ఫైర్‌స్టేషన్ ముందు ప్రధాన రహదారి రెండు భారీ గుంతలతో ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాలు వస్తే అంతే అటున వాహనం అక్కడ ఆగాలి ఇంకో వాహనం పోయేంతవరకు ఎదురుచూడాల్సిందే
ప్రతిరోజూ వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణించే ఈ రహదారి ఇలా నిర్లక్ష్యానికి గురవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పండుగల రద్దీలో తీవ్ర ప్రమాదం
ప్రస్తుతం తెలంగాణ అంతటా బతుకమ్మ, దసరా పండుగల సందడి నడుస్తోంది.
ఈ సందర్భంగా పాలకుర్తి, కొడకండ్ల, తిరుమలగిరి వంటి ప్రాంతాలకు అర్థగంటకో బస్సు నడుస్తోంది.
దీనికితోడు రోజూ వందల లారీలు, ట్రక్కులు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు ఈ మార్గాన్నే వాడుతున్నాయి.
ఈ రద్దీ సమయంలో గుంతలు వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని అధికారులు చెబుతారు… కానీ రోడ్డు మాత్రం గుంతల మయం అవుతోంది. ఇది ప్రజల ప్రాణాలతో ఆటలాడటమే” అని ప్రయాణికులు మండిపడుతున్నారు.
“ప్రజల ప్రాణాలు పణంగా…” – స్థానికుల ఆగ్రహం
స్థానికులు మాట్లాడుతూ –
“ఇది ప్రధాన రహదారి… అయినా ఆర్‌అండ్‌బి శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. చిన్నపాటి మరమ్మతులకైనా చర్యలు తీసుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?” అని ప్రశ్నిస్తున్నారు.
“రోజూ స్కూల్ బస్సులు, పాలు తీసుకెళ్లే వాహనాలు, పండుగల కోసం వెళ్తున్న కుటుంబాలు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. చిన్నపిల్లలతో కూడిన వాహనాలు కూడా ఇక్కడ దూసుకుపోతుంటాయి. ఒకవేళ ప్రమాదం జరిగితే ఎవరూ మాపై కనికరం చూపరు” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“ప్రభుత్వం, అధికారులు తక్షణం స్పందించాలి”
ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే ఈ గుంతలను వెంటనే భర్తీ చేసి రహదారిని సురక్షితంగా మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
“ఇంత రద్దీగా ఉండే రహదారి కాబట్టి అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలి. ప్రజలు బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఆనందంగా పండుగ జరుపుకోవాల్సిన వేళ, గుంతలతో భయాందోళనలో ప్రయాణం చేస్తున్నారు. ఇది ఏ విధమైన పరిపాలన?” అని విమర్శించారు.
“చర్యలు లేకపోతే ఆందోళనలు తప్పవు”
“ప్రజల సమస్యల పట్ల ఆర్‌అండ్‌బి శాఖకు కనీస బాధ్యతా భావం లేకుండా పోయింది. గుంతలు పూడ్చకపోతే రహదారిపైనే ఆందోళనలు చేపట్టక తప్పదు” అని స్థానికులు హెచ్చరించారు.

ప్రజలు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ –“మా ప్రాణాలకు హామీ ఎవరు ఇస్తారు? రోడ్డు బాగుచేయకపోతే అధికారుల నిర్లక్ష్యంపై మేమే పోరాటం చేస్తాం” అని స్పష్టం చేస్తున్నారు.


Comments