రాచకొండ కమిషనరేట్ పరిధిలో సిటీ ట్రైనింగ్ సెంటర్‌కు శంఖుస్థాపన
భరోసా, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లకు డిజిపి శివధర్ రెడ్డి ప్రారంభం
హైదరాబాద్, నవంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ బి.శివధర్ రెడ్డి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో నిర్మించనున్న సిటీ ట్రైనింగ్ సెంటర్ (సిటిసి) కు సోమవారం నాడు శంఖుస్థాపన చేశారు. అదేవిధంగా, సరూర్‌నగర్‌లో నిర్మించిన భరోసా మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు, డిసిపీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మేడిపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడిన డిజిపి శివధర్ రెడ్డి మాట్లాడుతూ
దివీస్ లేబరేటరీస్ లిమిటెడ్ సిఎస్ఆర్ నిధులతో సిటీ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని అన్నారు. పోలీస్ సిబ్బంది పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణానికి కూడా దివీస్ సంస్థ సిఎస్ఆర్ పథకం ద్వారా సహాయం చేయనున్నట్లు వెల్లడించారు.సిటీ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణంతో పోలీస్ సిబ్బందికి వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించవచ్చని చెప్పారు. సాంకేతిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు ఆధునిక శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు డ్రైవర్లు బాధ్యతాయుతంగా నడవాలని, వచ్చే నెల "సజీవంగా చేరుకోండి" పేరిట పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ, దివీస్ లేబరేటరీస్ సంస్థ సిటిసి నిర్మాణానికి ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మంచి వాతావరణంలో పోలీస్ సిబ్బందికి శిక్షణ అందించేందుకు సిటిసి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. దివీస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డి.మధుబాబు, జీఎం సుబ్బారావు పోలీస్ శాఖకు అవసరమైన సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.
రాచకొండ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి గగన్ దీప్, కమిషనరేట్ పరిధిలోని డిసిపీలు, అదనపు డిసిపీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహిళల భద్రత కోసమే భరోసా కేంద్రాలు : డిజిపి
రాచకొండ పరిధిలోని సరూర్‌నగర్‌లో నిర్మించిన భరోసా సెంటర్‌ను డిజిపి బి.శివధర్ రెడ్డి ప్రారంభించారు. మహిళల భద్రత కోసం భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళా బాధితులకు చట్టబద్ధ రక్షణ, కౌన్సిలింగ్ సదుపాయాలు అందించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ జి.సుధీర్ బాబు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డి ఎం.రమేష్, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డిసిపి టి.ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.


Comments