హాస్టల్ వర్కర్స్ పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలి.!
సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి.
సత్తుపల్లి, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, పోస్ట్‌మెట్రిక్ హాస్టల్స్‌లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్, డైలీవేజ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకుంది. సత్తుపల్లి పట్టణంలోని ఎస్టీ హాస్టల్ వద్ద జరుగుతున్న ఈ సమ్మెలో శనివారం సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులకు గత పది నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని విమర్శించారు. 2017లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ జారీ చేసిన జీవో 527 ప్రకారం కేటరింగ్ విధానం ప్రవేశపెట్టడం వల్ల ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలు 12 వేల రూపాయల నుంచి 9,200 రూపాయలకు తగ్గించారని పేర్కొన్నారు. తక్షణమే ఆ జీవోను రద్దు చేసి, జీవో 60 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అలాగే, బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో 2021లో జారీ చేసిన జీవో 64 కారణంగా డైలీవేజ్ వర్కర్ల వేతనాలు నెలకు 4 నుండి 12 వేల రూపాయల వరకు తగ్గాయని తెలిపారు. ఆ జీవోను కూడా రద్దు చేయాలని, లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, కనీసం నెలకు 26 వేల రూపాయల చొప్పున వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పని చేస్తున్న వారందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు ఈఎస్ఐ, పిఎఫ్ సదుపాయాలు కల్పించాలని, వారిని రెగ్యులర్ చేయడంతో పాటు వారసత్వ నియామకాలు అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు కొలికపోగు సర్వేశ్వరరావు, కార్మికులు సుశీల, సీతారత్నం, లక్ష్మీదేవి, పార్వతి, సత్యావతి, లక్ష్మి, నాగమణి, ఎల్లమ్మ, పద్మ, జమలమ్మ, సునీత, రాఘవమ్మ, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Comments