హాస్టల్ కార్మికుల వేతనాలు తక్షణమే విడుదల చేయాలి: సిఐటియు
సత్తుపల్లి, సెప్టెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, పోస్ట్‌మెట్రిక్ హాస్టల్స్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, డైలీవేజ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మె 19వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు రైతు సంఘం జిల్లా నాయకులు రావుల రాజబాబు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "పది నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. హాస్టల్ కార్మికులకు తక్షణమే పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలి. కనీస వేతనం 26 వేలు చొప్పున ఇవ్వాలి" అని డిమాండ్ చేశారు.
సమ్మె ప్రాంగణంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు కొలికపోగు సర్వేశ్వరరావు మాట్లాడుతూ, 2017లో గిరిజన సంక్షేమ శాఖ జారీ చేసిన జీవో 527 కారణంగా కేటరింగ్ విధానం అమలు చేయడం వల్ల ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలు 12 వేల నుండి 9,200 రూపాయలకు తగ్గిపోయాయని విమర్శించారు. 2021లో తెచ్చిన జీవో 64 వలన కూడా డైలీవేజ్ కార్మికులు నెలకు 4 నుండి 12 వేల వరకు నష్టపోతున్నారని తెలిపారు.
వేతనాల సమస్య తక్షణమే పరిష్కరించాలని, జీవో 527, 64లను రద్దు చేయాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని, పని చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని, వారసత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
"ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె మరింత ఉదృతం అవుతుంది" అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కార్మికులు సుశీల, సీతారత్నం, లక్ష్మీదేవి, పార్వతి, సత్యావతి, లక్ష్మి, నాగమణి, ఎల్లమ్మ, పద్మ, జమలమ్మ, సునీత, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Comments