తెలంగాణకు బొగ్గు,విద్యుత్ విషయంలో అన్యాయం కొనసాగిస్తే ఊరుకోము
లోక్‌సభలో గళమెత్తిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
న్యూఢిల్లీ,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు, విద్యుత్ అవసరాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య లోక్‌సభ వేదికగా గళమెత్తారు. రాష్ట్రానికి అప్రతిష్ఠ కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందని విమర్శించిన ఆమె, బొగ్గు కేటాయింపులో తెలంగాణను విస్మరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు బ్లాకులు ఇప్పటికీ కేటాయించకపోవడం వల్ల విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇంధన కొరతతో రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు, పారిశ్రామిక వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, తక్షణమే బొగ్గు బ్లాకుల కేటాయింపు జరగాలని డిమాండ్ చేశారు.
ప్రజా ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీస్తూ గట్టిగాస్పష్టం చేసిన డాక్టర్ కావ్య
“తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేంతవరకు కేంద్రాన్ని వదలము” అని లోక్‌సభలో ధైర్యంగా ప్రకటించిన డాక్టర్ కావ్య, ప్రభుత్వ యాజమాన్యంలోని సింగరేణి సంస్థను బలోపేతం చేయడం ద్వారానే రాష్ట్ర ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా సుసాధ్యం అవుతుందని వివరించారు. ప్రస్తుతంగా ఖాళీగా ఉన్న, లేదా ప్రైవేటు సంస్థలు విఫలమైన బ్లాకులను తిరిగి ప్రభుత్వ సంస్థలకు కేటాయించాలని స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి సమాధానం – తెలంగాణకు పరిమిత హామీలే
ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నుంచి వచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని లోక్‌సభకు వెల్లడించిన డాక్టర్ కావ్య, ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ బొగ్గు కేటాయింపులు రూల్‌బేస్ విధానానుసారం జరుగుతున్నాయన్న కేంద్ర హామీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం తెలిపినప్పటికీ, అది ఆచరణలో ప్రతిఫలించాలన్నది డాక్టర్ కావ్య అభిప్రాయం.
మూలస్తాయిలో నుంచే పోరాటం కొనసాగించాల్సిన అవసరం
వనరుల పంపిణీలో పారదర్శకత, సమగ్రత పాటించకపోతే తెలంగాణ వెనకపడే ప్రమాదం ఉందని హెచ్చరించిన డాక్టర్ కావ్య, రాష్ట్ర హక్కుల కోసం పోరాటం తామేదైనా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.


Comments