వేలేరు మండలంలో అక్రమ ఇసుక దందా
వేలేరు, 25 నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండల పరిధిలో అక్రమ ఇసుక రవాణా మళ్లీ పెరగడం స్థానిక ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తోంది. గోదావరి ఇసుక పేరుతో కొంతమంది వ్యక్తులు రాత్రి వేళల్లో మండల చుట్టుపక్కల ఉన్న వాగులు, చెరువుల నుండి నాసిరకపు ఇసుకను అక్రమంగా తవ్వి తీసుకొస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల ప్రభుత్వం అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం వల్ల ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అక్రమ దందాగాళ్లు వాగు ఇసుకను గోదావరి ఇసుకతో కలిపి ట్రాక్టర్ ట్రిప్‌కు 8,000 నుండి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
అక్రమ రవాణా రాత్రివేళల్లోనే జరుగుతుండగా, దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అధికారులు “నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ చూడనట్లు వ్యవహరిస్తున్నారు” అంటూ స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఈ దందా కారణంగా ప్రజలకు ఇసుక ధరలు భారమవుతుండటంతో, తక్షణం జోక్యం చేసుకునిచర్యలు తీసుకోవాలని బాధితులు సంబంధిత విభాగాల అధికారులను కోరుతున్నారు.


Comments