బాల్యవివాహాలపై న్యాయ విజ్ఞాన సదస్సు
ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు:
ధర్మసాగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో “బాల్యవివాహాలు నిరోధక చట్టం – అవగాహన” అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించబడింది. మండల పరిషత్తు అభివృద్ధి అధికారి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి క్షమాదేశ్ పాండే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జడ్జి దేశ్ పాండే మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండకముందు అమ్మాయికి, 21 సంవత్సరాలు నిండకముందు అబ్బాయికి పెళ్లి చేయడం బాల్య వివాహంగా పరిగణించబడుతుందన్నారు. బాల్యవివాహాల వల్ల శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదురవుతాయనీ, సమాజ అభివృద్ధికి ఈ వివాహాల నిరోధం అత్యవసరమని సూచించారు. ప్రజల్లో తగిన అవగాహన కల్పించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తదనంతరం మండల విద్యాధికారి డాక్టర్ రామ్ధన్ అధ్యక్షతన ఉపాధ్యాయులు, స్వయం సహాయక బృందాల సభ్యుల కోసం ప్రత్యేక విద్యా కార్యాశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులను పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే “అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ” కార్యక్రమం ద్వారా అక్షరాస్యత పెంపు దిశగా చేపడుతున్న కార్యక్రమాలపై అనిల్, జేవియర్‌లు విషయ నిపుణులుగా దిశానిర్దేశం చేశారు.


Comments