భూ కబ్జాదారులకు హైకోర్టులో చుక్కెదురు
ప్రభుత్వ భూములపై స్టే నిరాకరించిన న్యాయస్థానం
12 గుంటల స్థలానికి రెవెన్యూ శాఖ ఫెన్సింగ్ తహసిల్దార్ చర్యలకు మద్దతుగా ప్రజా సంఘాలు
ఏఎస్ రావు నగర్, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్ రావు నగర్ డివిజన్ జమ్మిగడ్డలో ప్రభుత్వ భూముల కబ్జా దారులకు హైకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. జమ్మిగడ్డలోని సర్వే నంబర్లు 199/1, 376లోని ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వ్యక్తులు హైకోర్టులో డబ్ల్యూపి 31099/2025తో స్టే కోరగా, న్యాయస్థానం నిరాకరించింది.కోర్టు తహసిల్దార్ లేదా కలెక్టర్ ప్రభుత్వ భూముల నిజస్వరూపం నిర్ణయించాల్సిందిగా స్పష్టం చేసింది.
ఈ కేసులో స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డిని ప్రతివాదిగా చేర్చకుండా కోర్టును సంప్రదించిన విషయాన్ని గమనించిన న్యాయమూర్తి ఆక్షేపించారు.ఫిర్యాదుదారు శిరీష సోమశేఖర్ రెడ్డి న్యాయవాది ద్వారా సమర్పించిన వాదనతో ఏకీభవించిన కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించి, తహసిల్దార్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.ఇదిలా ఉండగా, జమ్మిగడ్డలో కబ్జా చేయబడ్డ సుమారు 12 గుంటల ప్రభుత్వ భూములకు కాప్రా తహసిల్దార్ సుచరిత ఆధ్వర్యంలో ఫెన్సింగ్ వేయించారు. ఈ చర్యతో కబ్జాదారులు ఆందోళనలో పడ్డారు.భూముల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మా రెడ్డి, సమాచార హక్కు సాధన సమితి కన్వీనర్ తాడూరు గగన్ కుమార్‌లను పలువురు అభినందించారు.ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని సూచించిన ఈ నాయకులు, భూ కబ్జాదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చర్లపల్లి కాలనీల ప్రజలు ఈ విషయంపై కలెక్టర్, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు.


Comments