పాత బస్టాండుకు కనీస సదుపాయాలు కల్పించాలి
అఖిలపక్ష ఐక్యవేదిక వినతిపత్రం
వనపర్తి,నవంబర్26(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పాత బస్టాండు తిరిగి ప్రారంభించినప్పటికీ, ప్రయాణికులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు డిపో మేనేజర్ ద్వారా రీజినల్ మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. రీజినల్ మేనేజర్ వనపర్తి సందర్శనకు వస్తున్నట్లు తెలిసిన వెంటనే, పాత బస్టాండులోని సమస్యలను వెంటనే పరిష్కరించమని డి.ఎం కు విజ్ఞప్తి చేశారు.వినతిపత్రంలో ప్రధానంగా పాత బస్టాండ్ ముందు ఉన్న కాలువలో చెత్త పేరుకుపోవడం, దానిని వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం, ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు, చుట్టుపక్కల మట్టి దిబ్బలు, చెత్తాచెదారం తొలగించడం, బస్టాండు అంతటా సి.సి రోడ్డు వేసి అన్ని బస్సులు పాత బస్టాండులోకి వెళ్లేలా చర్యలు తీసుకోవడం, బస్టాండు ప్రాంగణంలో నిలిపిన ప్రైవేటు వాహనాలను తొలగించడం, ప్రయాణికులకు కూర్చోవడానికి తగిన సీటింగ్ సౌకర్యం, నీడ ఏర్పాటు వంటి డిమాండ్లు ఉన్నాయి.అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వం వెంటనే ఈ సదుపాయాలను కల్పించాలని స్పష్టంగా కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి సతీష్, రామస్వామి, శివకుమార్, రాము, కొత్తగొల్ల శంకర్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments