సత్తుపల్లి సింగరేణిలో మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు.!
ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ కార్యదర్శి తీగల క్రాంతికుమార్.
సత్తుపల్లి, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి జె.వి.ఆర్ ఓసీ, జె.వి.ఆర్ సిహెచ్‌పీ, కిష్టారం ఓసీ మైన్స్‌లలో ఐఎన్‌టీయూసీ ఫిట్ సెక్రటరీలు రామారావు, బాలాజీ, నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో బ్రాంచ్ కార్యదర్శి తీగల క్రాంతికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి తీగల క్రాంతికుమార్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ ఐఎన్‌టీయూసీ కొత్తగూడెం రీజియన్‌లో ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరు, కార్పొరేట్ ప్రాంతాల్లో గెలుపు సాధించడానికి కృషి చేసిందని తెలిపారు. ఇందుకు యూనియన్ తరఫున నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాసేవలో అలుపెరగని నాయకుడు, పేదల పాలిట పెన్నిధి, జనహృదయ నాయకుడు, ఎవరికైనా కష్టం వచ్చినా “నేనున్నాను” అని స్పందించే నాయకుడు, “అన్న అంటే నేనున్నానని” భరోసా ఇచ్చే నాయకుడు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కొనియాడారు.
జిల్లాలో ఎవరి కుటుంబంలో శుభకార్యమో, ఇతర ముఖ్య కార్యక్రమమో జరిగినా కుటుంబ పెద్దగా పాల్గొని కుటుంబ సభ్యులతో మమేకమయ్యే నాయకుడు అని ఆయన తెలిపారు. అలాగే సింగరేణి కార్మికుల కష్టాలు, సమస్యలు బాగా తెలిసిన నాయకుడు అని ప్రశంసించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్టా రాగమయి, కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో కృషి చేస్తామని తెలిపారు.
సింగరేణి సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక భద్రత మరియు హక్కుల సాధన దిశగా ఎల్లప్పుడూ ఐఎన్‌టీయూసీ యూనియన్ కార్మికుల పక్షానే ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఐఎన్‌టీయూసీ వివిధ కమిటీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు మరియు డీఎల్ఆర్ ఉద్యోగులు పాల్గొన్నారు.


Comments