సత్తుపల్లిలో బిసి రిజర్వేషన్ కోసం మంత్రి తుమ్మల పోరాట పిలుపు.
సత్తుపల్లి, అక్టోబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణంలో జరిగిన బిసి బంద్ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాగమయితో కలిసి పాల్గొన్నారు. సత్తుపల్లి పాత సెంటర్ నుండి బస్టాండ్ సర్కిల్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఇద్దరూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసినట్లు గుర్తుచేశారు. సామాజిక విప్లవం కోసం కాంగ్రెస్ మెనిఫెస్టోలో బిసి గణనను పొందుపరచినట్లు తెలిపారు.
రాహుల్ గాంధీ మాట నిలబెట్టటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో బిసి గణన చేపట్టారని చెప్పారు. చట్ట సభలో ఆమోదం తెలిపినా, సాంకేతిక కారణాలతో కేంద్ర ప్రభుత్వం అడ్డు తిరుగుతోందని విమర్శించారు.
బిసి రిజర్వేషన్ సాధన కోసం ప్రజా క్షేత్రంతో కలసి పోరాటం చేస్తామని తుమ్మల తెలిపారు. బిజెపి మెడలు వంచే వరకు పోరాడి రిజర్వేషన్ తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.
గుజరాత్‌లో బిసి రిజర్వేషన్ కారణంగానే నరేంద్ర మోదీ ప్రధాని పదవిని పొందగలిగారని గుర్తుచేశారు. చట్టబద్ధంగా చేసిన సవరణలను పరిశీలించి తెలంగాణకు బిసి రిజర్వేషన్ ఇవ్వాలని మోదీని కోరినట్లు తెలిపారు.
బిసిలను నట్టేటా ముంచిన పార్టీ బిజెపి అని, బిసిలకు అన్యాయం చేస్తున్న బిజెపి రానున్న రోజుల్లో ఓటమి చవిచూస్తుందని అన్నారు. ఈ బంద్‌లో బిజెపి జెండాలు తప్ప అన్ని జెండాలు కనబడుతున్నాయంటే, ప్రజల మనసుల్లో ఆ పార్టీ స్థానం కోల్పోయిందని వ్యాఖ్యానించారు.
రానున్న రోజుల్లో బిజెపి పార్టీ భూస్థాపితం కానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.


Comments