కొత్త రిజర్వాయర్ల నిర్మాణం పై ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ
వనపర్తి,అక్టోబర్7(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి నియోజకవర్గంలో కొత్త రిజర్వాయర్ల నిర్మాణం, సాగునీటి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెల్లడించారు.మంగళవారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తరువాత, వనపర్తి నియోజకవర్గంలో భవిష్యత్ తరాల సాగునీటి అవసరాల కోసం చేపట్టబోయే రిజర్వాయర్ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు.ముఖ్యంగా గొల్లపల్లి రిజర్వాయర్ మరియు బుద్ధారం స్టేజ్–2 రిజర్వాయర్ నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే, నియోజకవర్గ పరిధిలో భవిష్యత్ తరాలకు కూడా సాగునీటి సమస్యలు పరిష్కరించబడతాయని ఎమ్మెల్యే తెలిపారు.అదేవిధంగా, ఖిల్లా ఘనపురం మండలంలోని ఘనపసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ముందు ఎమ్మెల్యే అభ్యర్థించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, రైతులకు తక్షణమే నష్టపరిహారం మంజూరు చేయనున్నట్లు తెలిపారు.వనపర్తి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


Comments