భవానీనగర్‌లో జనం బాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
నాగారం, డిసెంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ జిల్లా నాగారం గ్రేటర్ పరిధిలోని రాంపల్లి చౌరస్తా భవానీనగర్‌లో జన జాగృతి సమితి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టారు.
స్థానికులు ప్రధానంగా మురికికాలువ సమస్య తీవ్రంగా ఉందని, సాయంత్రం అయ్యేసరికి దుర్వాసనతో డోర్లు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోందని కవితకు వాపోయారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుతో సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందని వాసులు కోరారు. సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు.అలాగే భవానీనగర్ కాలనీలో బస్తీ దవాఖాన, ప్రాథమిక పాఠశాల ఏర్పాటు అవసరం ఉందని ప్రజలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులను కవిత అందజేశారు. మిగిలివున్న వారికి కూడా ఉచితంగా కార్డులు పంపిణీ చేయనున్నట్లు మహిళా నాయకురాలు భవానీ తెలిపారు.కవిత అనంతరం జవహర్‌నగర్ డంపింగ్ యార్డును కూడా పరిశీలించారు. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయకుండానే రాంకీ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నందున స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు కవిత దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కారానికి ఎంతవరకైనా పోరాడుతానని కవిత భరోసా ఇచ్చారు.ఈకార్యక్రమంలో వెంకటేశ్, నాగారం అధ్యక్షులు ఎత్తరి గణేష్, జన జాగృతి సమితి మహిళా నాయకురాళ్లు లలిత, భవానీ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments