అధికారులు తమ విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి
-అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
వసతి గృహ సంక్షేమ అధికారులు జాబ్ చార్ట్ ప్రకారం తమ విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వివిధ సంక్షేమ శాఖల వసతి గృహాల సంక్షేమ అధికారులతో వసతి గృహాలనిర్వహణపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహాల్లో వసతి పొందుతున్న విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత సంక్షేమ అధికారులపై ఉందని అన్నారు. విద్యార్థుల బాగోగులు చూస్తూ, వారిని జాగ్రత్తగా, తమ పిల్లల్లా చూసుకోవాలన్నారు. సంక్షేమ అధికారులు ప్రధాన కార్యస్థానంలో ఉండాలన్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూచించిన సమయంలో తప్పక వసతి గృహంలో ఉండాలన్నారు. విద్యార్ధుల రోజువారి హాజరును పర్యవేక్షణ చేయాలన్నారు. వసతి గృహాల్లో కనీస మౌళిక వసతులు, పరిశుభ్రత నిర్వహణ చేయాలన్నారు. వసతి గృహ సంబంధ రిజిష్టర్లు నిర్వహించాలని, సంక్షేమ అధికారి, సిబ్బంది, విద్యార్థులకు సంబంధించి కదలికల రిజిష్టర్ నిర్వహించాలని అన్నారు. విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలని, మెడికల్ చెకప్ లు చేయించాలని ఆయన తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం చేపట్టి, వారి పిల్లల పురోగతిని వివరించాలన్నారు. పాఠ్యతర కార్యకలాపాలు చేపట్టి, అన్ని విధాలా చురుకుగా తయారయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు వసతి గృహాల ఆకస్మిక తనిఖీలు చేపడతారని, లోపాలుంటే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి విజయలక్ష్మి, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జ్యోతి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం.ఏ. మహమూది, వివిధ సంక్షేమ శాఖల సహాయ సంక్షేమ అధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments