పార్టీ క్రమశిక్షణే ప్రమాణం...!
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపికపై అభిప్రాయ సేకరణ
పాలేరు నియోజకవర్గ నాయకుల అభిప్రాయాలు సేకరించిన ఏఐసీసీ, పీసీసీ అబ్జర్వర్లు
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 14, తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని (డీసీసీ) ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు, పీసీసీ సూచనల ప్రకారం మంగళవారం అభిప్రాయ సేకరణ సమావేశాలు నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ... జిల్లాలో అందరికీ ఆమోదయోగ్యమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు చురుగ్గా సాగాయి. ఉదయం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లిలో ఉన్న అమ్మ ఫంక్షన్ హాల్లో ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, తిరుమలాయపాలెం మండలాల బ్లాక్ కాంగ్రెస్ నాయకులతో ప్రత్యేక సమావేశం జరిగింది. పార్టీ భవిష్యత్ దిశ, క్రమశిక్షణ, నాయకత్వం అవసరాలపై నాయకులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.
మధ్యాహ్నం కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్.ఆర్. ఫంక్షన్ హాల్లో నేలకొండపల్లి, కూసుమంచి మండలాలకు చెందిన బ్లాక్ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మరో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ అబ్జర్వర్ మహేంద్ర జినీ, పీసీసీ అబ్జర్వర్లు పాల్గొని నాయకులతో సమీక్ష జరిపారు. అభిప్రాయ సేకరణ అనంతరం పరిశీలకులు మాట్లాడుతూ... డీసీసీ అధ్యక్షుని ఎంపికలో అందరికీ ఆమోదయోగ్యమైన, పార్టీ పట్ల నిబద్ధత కలిగిన, క్రమశిక్షణతో ఉన్న నాయకుడినే ఎంపిక చేస్తామని తెలిపారు. పార్టీ ఐక్యతను కాపాడుతూ, త్యాగం చేసిన, ప్రజలతో మమేకమైన నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ శక్తిని పునరుద్ధరించేందుకు సమన్వయంగా పని చేయాలని అబ్జర్వర్లు సూచించారు. ఈ సమావేశాల్లో ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments