నీట్ పీజీలో రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించిన పోరిక శ్రీరామ్
ములుగు,తెలంగాణ ముచ్చట్లు:
ములుగు జిల్లా మల్లేపల్లి గ్రామానికి చెందిన పోరిక శ్రీరామ్ ఇటీవల నిర్వహించిన నీట్ పీజీ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు మరియు దేశవ్యాప్తంగా 52వ ర్యాంకు సాధించి గాంధీ మెడికల్ కాలేజ్, హైదరాబాద్‌లో జనరల్ మెడిసిన్‌లో ప్రవేశం పొందాడు. సాధారణ రైతు పోరిక తులసీరామ్, అరుణ దంపతుల కుమారుడైన శ్రీరామ్ చిన్నప్పటినుంచి తెలివైన విద్యార్థిగా ప్రశంసలు పొందాడు.
హన్మకొండ ఆర్డీ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ చదువుతూ రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించిన శ్రీరామ్, డాక్టర్ కావాలని సంకల్పించి, పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించాడు. ఆ పట్టుదల ఫలితంగా ఈ రోజు మల్లేపల్లి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు.
పోరిక కుటుంబం మొత్తం గ్రామానికి ఆదర్శంగా నిలుస్తోంది. బలరాం, తులసీరామ్, రాజు అనే ముగ్గురు అన్నదమ్ముల కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమ రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. బలరాం కుమారుడు విటల్ కుమార్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా సేవలందిస్తుండగా, తులసీరామ్ కుమారుడు శ్రీరామ్ డాక్టర్ అవ్వగా, రాజు కుమారుడు సిద్ధార్థ ఐఐటీ ఇండోర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
తన విజయానికి కారణమైన తల్లిదండ్రుల సంపూర్ణ మద్దతు, పట్టుదల, గ్రామస్తుల ప్రేమను గుర్తు చేసుకున్న శ్రీరామ్, భవిష్యత్తులో తన సేవలతో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తానని అన్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులు అతనిపై గర్వంతో పొంగిపోయారు.
శ్రీరామ్ విజయాన్ని పురస్కరించుకొని మల్లేపల్లి గ్రామంలో లంబాడి ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీరామ్‌కు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో లౌడియా పల్లవి, రాజు నాయక్, రాము నాయక్, శారద, హేమ నాయక్, శంకర్ రజిత, జాటర్ శ్రీను, వాంకుడోత్ విజయ్, తదితరులు పాల్గొని శ్రీరామ్‌ను అభినందించారు.


Comments