సాహిత్యానికి స్ఫూర్తిదాయకం పోతురాజు ప్రతిభ.
నాన్నే నాహీరో’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాగమయి.
సత్తుపల్లి, అక్టోబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
విద్యార్థి దశలోనే సాహిత్య సృజనలో ప్రతిభ కనబరచిన ఆవుల పోతురాజు నేటి యువతకు ఆదర్శమని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. గురువారం సత్తుపల్లిలో గార్లపాటి–బొల్లేపల్లి ట్రస్ట్ ప్రచురించిన పోతురాజు బాలసాహిత్య రచన ‘నాన్నే నాహీరో’ పుస్తకాన్ని ఎమ్మెల్యే దంపతులు ఆవిష్కరించారు.
పిల్లల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే సమాజానికి ఆణిముత్యాలు సిద్ధమవుతాయని ఆమె పేర్కొన్నారు. పేదరికం సృజనాత్మకతకు అడ్డంకి కాదని, గుడారంలో నివసిస్తూ తన రచనా ప్రతిభతో సమాజం దృష్టిని ఆకర్షించిన పోతురాజు ప్రశంసనీయం అని అన్నారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని తెలిపారు.
కార్యక్రమంలో పోతురాజు తల్లి తిరుపతమ్మను, అతన్ని ప్రోత్సహించిన తెలుగు ఉపాధ్యాయురాలు ఎం.రమాదేవిని, ఎన్.సి.హెచ్. వెంకటాచార్యులు దంపతులను, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోందు షేక్‌ను, ట్రస్ట్ నిర్వాహకులు గార్లపాటి రామకృష్ణ, మధుసూదనరాజును ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆషా డైరెక్టర్ రామిశెట్టి శ్రీనివాసరావు, పసుపులేటి నాగేశ్వరరావు, మహ్మద్ షాకీర్ హుస్సేన్, గోలి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments