ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి
-అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు. శుక్రవారం మధిర మండల తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి అర్జీల పరిష్కారం, ఓటరు జాబితా సవరణ పై రెవెన్యూ అధికారులతో మధిర నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధరణి పెండింగ్ దరఖాస్తులను రోజువారి లక్ష్యం ఏర్పరచుకొని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, సోమవారం స్వీకరించిన దరఖాస్తులు, ఆ వారంలోనే, శుక్రవారం లోగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తిరస్కరించిన దరఖాస్తుల విషయమై కారణాలు అర్జీదారునికి తెలుపాలన్నారు. ఓటరు జాబితా సవరణలో పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ఇంటింటి సర్వే పటిష్టంగా జరగాలని, ఎన్నికల సంఘం నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు. అర్హతగల ప్రతిఒక్కరు ఓటుహక్కు పొందేలా ప్రణాళికాబద్ద చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ అన్నారు.
ఈ సమీక్ష లో మధిర నియోజకవర్గ తహసీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.


Comments