ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ రెవెన్యూ, హౌజింగ్ అధికారులతో రెవెన్యూ, హౌజింగ్ పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యత మనపై ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి, ఫెన్సింగ్ ఏర్పాటుచేసి, రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ, ప్రభుత్వ భవిష్యత్ అవసరాలకు, పరిశ్రమలు, అభివృద్ధి కి స్థలాలు ఎంతో అవసరమన్నారు. రఘునాధపాలెం మండలంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాల నియంత్రణ కు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. మైనింగ్, పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకొని అక్రమ మైనింగ్ కి అడ్డుకట్ట వేయాలన్నారు. ఖమ్మం అర్బన్ మండలం గోళ్లపాడు చానల్ పై ఆక్రమణల తొలగింపుపై చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ జీవో 58, 59 లపై న్యాయబద్ధంగా లేని వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. తిరస్కరించిన దరఖాస్తులకు సంబంధించి స్థలాలను స్వాధీనం చేసుకుని, ఫెన్సింగ్ ఏర్పాటు, రక్షణ చర్యలు చేయాలన్నారు. రోడ్డు ఆక్రమణలు, అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్నచోట ప్రత్యామ్నాయ స్థలం చూపాలన్నారు. రోడ్ల విస్తరణ పై దృష్టి పెట్టాలన్నారు. ఎన్ఎస్పీ భూములకు సంబంధించి చట్టబద్ధంగా స్థలాల పంపిణీ, ఆక్రమణలపై సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. చెరువులు, కాల్వల స్థలాల పరిరక్షణ చేయాలన్నారు. డంపింగ్ యార్డ్ వద్ద ఏరోజుకారోజు తడి, పొడిచెత్త వేరుచేయడం, డిస్పోజ్ చేయడం జరగాలన్నారు. రహదారుల కిరువైపుల మొక్కలు నాటేటప్పుడు, విస్తరణ, కరంట్ లైన్లను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ అవసరాల మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌళిక సదుపాయాల కల్పన కు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. నిర్మాణం చేపట్టిన అన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించి, అధికారులు అన్ని కాలనీలు సందర్శించి, నిర్మాణ పనుల పరిస్థితి ని తనిఖీ చేయాలన్నారు. ప్రారంభించిన ఇండ్లు పునాది, లెంటల్, స్లాబు వరకు, తుది దశలో ఉన్న ఇండ్ల పరిస్థితి వారిగా సమగ్ర నివేదిక సమర్పించాలని, ఇండ్ల నిర్మాణం పూర్తిచేసి, లబ్దిదారులకు అందజేయడానికి అవసరమైన నిధుల వివరాలు సమర్పించాలని మంత్రి అన్నారు.
సమీక్షలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, గుర్తించిన స్థలాల పరిరక్షణకు ఫెన్సింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కు అన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. వివిధ దశల్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిస్థితిపై అధికారులు నివేదిక సమర్పించాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్వో ఎం. రాజేశ్వరి, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ ఇఇ తానాజీ, ఇర్రిగేషన్ ఇఇ అనన్య, హౌజింగ్ ఇఇ శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments