రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కు ఎంపికైన తాటికాయల జెడ్పిహెచ్ఎస్ విద్యార్థిని
ధర్మసాగర్,డిసెంబర్20(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లాలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో తాటికాయల జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆమంచ గీతిక శ్రీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.గ్రామానికి చెందిన ఆమంచ రమేష్ కుమార్తె అయిన గీతిక శ్రీ “మున్సిపల్ నీటి లీకేజీని స్వయంచాలకంగా గుర్తించే విధానం” అనే అంశంపై రూపొందించిన ప్రాజెక్ట్ జిల్లా స్థాయి న్యాయనిర్ణేతల ప్రశంసలు పొందింది.
హనుమకొండలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్‌లో డిసెంబర్ 18 నుండి 20 వరకు నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించగా, వినూత్న ఆలోచన, సామాజిక ప్రయోజనం, సాంకేతిక స్పష్టత అంశాల్లో అత్యుత్తమంగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.
ఈ ప్రాజెక్ట్‌కు పి. దీప్తి (భౌతిక శాస్త్ర ఉపాధ్యాయిని), జి. ఉషారాణి (జీవ శాస్త్ర ఉపాధ్యాయిని) మార్గదర్శకులుగా వ్యవహరించారు. విద్యార్థిని ప్రతిభకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫాతిమా మేరీతో పాటు సీనియర్ ఉపాధ్యాయులు డి. నవీన్ కుమార్, టి. వసుందర, పి. శ్రీనివాస్, బి. రాజు, ఎస్. ఇందిరాణి, ఎన్. కల్యాణ్, పిఎస్ హెచ్‌ఎం బి. వెంకటేశ్వరరెడ్డి, రాజు, హేమలత అభినందనలు తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ గీతిక శ్రీ మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి పాఠశాల పేరు ప్రతిష్ఠలు నిలబెట్టాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.


Comments