బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన సిగ్గుచేటు
బస్‌భవన్ వద్ద బస్సులు అడ్డుకోవడం దారుణం – కొలిపాక సతీష్
స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
బీఆర్ఎస్ పార్టీ నాయకులు బస్‌భవన్ వద్ద బస్సులను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం సిగ్గుచేటు చర్యగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొలిపాక సతీష్ తీవ్రంగా విమర్శించారు.
డివిజన్ కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గతంలో 10 సంవత్సరాలపాటు కేసీఆర్ ప్రభుత్వం పాలనలో ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ బాధలు ప్రజలు ఎప్పటికీ మరవలేరని అన్నారు. తమ హక్కుల కోసం పోరాడిన ఆర్టీసీ కార్మికులను బెదిరించి ఉద్యోగాల నుండి తొలగించమని యత్నించినవారు ఎవరో ప్రజలకు బాగా తెలుసన్నారు.
ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించి 48 వేల మంది ఉద్యోగులను రోడ్డున పెట్టినవారు బీఆర్ఎస్ నేతలేనని సతీష్ గుర్తు చేశారు. ఆందోళన చేసిన కార్మికులపై కేసులు పెట్టడం, మహిళా ఉద్యోగులను పిల్లలతో పోలీస్ స్టేషన్లలో కూర్చో బెట్టడం వంటి అమానవీయ ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“మీ పాలనలో ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు బస్‌భవన్ వద్ద కార్యక్రమాలు చేయడం సిగ్గు శరం కాదు?” అని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ పునరుద్ధరణ దిశగా పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకువచ్చిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, 2 వేల కండక్టర్ పోస్టుల భర్తీ, 1,300 డ్రైవర్–శ్రామిక పోస్టుల నియామకం, మూడు కొత్త బస్ డిపోల మంజూరులు కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమయ్యాయని వివరించారు.
“ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకొని అభివృద్ధికి సహకరించాలి” అని కొలిపాక సతీష్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా నాయకులు మామిడ్ల శ్రీనివాస్, గట్టు కోటి, నక్క పాపయ్య, గట్టు సురేందర్, గట్టు ఎల్లయ్య, జంపాల శ్రీకాంత్, శ్రీనివాస్, తాళ్లపల్లి కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Comments