పేదల చిరకాల వాంఛ నెరవేరింది
ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారు
-భద్రాద్రి రాముని సన్నిధిలో ప్రారంభమైన పథకం
– అదే భగవంతుని ఆశీస్సులతో గృహప్రవేశం
-బెండలపాడు గ్రామంలో 27 ఇండ్ల గృహప్రవేశం సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా
-హెలిపాడ్, సభా ప్రాంగణం, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలన
-లక్ష మందితో జరగనున్న మహోత్సవం
– కులమతాలకు అతీతంగా విజయవంతం చేయాలని పిలుపు
భద్రాద్రి,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 21న శ్రావణ మాస శుభ ముహూర్తంలో 27 ఇండ్ల గృహప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమం పేదల చిరకాల వాంఛను నెరవేర్చే చారిత్రక ఘట్టంగా నిలవనుందని స్థానికులు అంటున్నారు.బెండలపాడు గ్రామానికి మొత్తం 312 ఇండ్లు మంజూరవ్వగా, 72 ఇండ్లు నిర్మాణం పూర్తయ్యాయి. అందులో 27 ఇండ్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహప్రవేశం జరగనుంది. గతంలో భద్రాద్రి రాముని సన్నిధిలో ప్రారంభమైన ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇప్పుడు అదే రాముని ఆశీస్సులతో గృహప్రవేశాల రూపంలో కొనసాగుతుండటం విశేషంగా మారింది.
సోమవారం గృహప్రవేశాలు జరగబోయే ఇండ్లను శాసనసభ్యులు జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, రామదాస్ నాయక్, మట్ట రాగమయి తదితరులు జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం హెలిపాడ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించి, పోలీస్ బందోబస్తు, వీఐపీల ప్రోటోకాల్, ప్రజా రాకపోకల నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించి సూచనలు చేశారు.
లక్ష మందితో జరగనున్న ఈ మహోత్సవం పండగ వాతావరణంలో సాగనుందని నాయకులు తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పేదవాడి కలలను నిజం చేస్తూ, పునాదులపై భవిష్యత్తు నిలబెట్టే ఈ గృహప్రవేశాలు గ్రామ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం రాయనున్నాయి.


Comments