ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
-కె.ఆర్ .నాగరాజు,వర్ధన్నపేట ఎమ్మెల్యే
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. శనివారం హాసన్పర్తి ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం కింద నమూనా ఇల్లు నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ సత్య శారద, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు సుమారు 15 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా, ఇంటి స్థలం ఉన్న నిరుపేదలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ ప్రభుత్వం రైతులు, మహిళల సంక్షేమం కోసం అనేక నవీన పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.
మహిళల కోసం గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే అందిస్తుండటంతో పాటు, ఇతర సంక్షేమ పథకాల ద్వారా మహిళల ఆర్థిక స్థితి మెరుగుపరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశిస్తున్నారని వివరించారు. ఇందిరమ్మ ఇల్లు పొందడంలో ఏవైనా సమస్యలు ఎదురైతే తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
హనుమకొండ ఇన్‌చార్జ్ కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ, 24,467 దరఖాస్తులు అందాయని, ఈ నెలాఖరుకు సర్వే పూర్తవుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో కల్పిత నమూనా ఇల్లు ప్రజలకు స్పష్టతనందించడంలో కీలకమని వివరించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


Comments