ఎస్సి వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పును తప్పనిసరిగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సంక్లిష్ట సమస్యలో ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు.
గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరమ్ ఫర్ మాదిగ, చమర్, ఇతర అనుబంధ కులాల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలు పట్ల ప్రభుత్వం సున్నిత దృష్టితో ఉన్నట్లు పేర్కొన్నారు.
వర్గీకరణపై ప్రత్యేక కమిటీలు:
అంశంపై న్యాయపరమైన చిక్కులు లేకుండా స్పష్టమైన విధానం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్కలతో కూడిన సబ్ కమిటీని నియమించిన విషయం ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అలాగే, వర్గీకరణ అమలు కోసం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శమీమ్ అఖ్తర్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. నివేదిక మరో వారం రోజుల్లో అందనున్నట్లు తెలిపారు.
మాదిగలకు ప్రాధాన్యత:
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగ సామాజిక వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేసిన ముఖ్యమంత్రి, వర్గీకరణ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు మాదిగ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Comments