విద్యార్థిని లక్ష్మీ భవాని కీర్తికి మెరుగైన వైద్యం అందించాలి
మాజీ ఎంపీ నామ డిమాండ్
ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా బీసీ గురుకుల పాఠశాలలో చదువుతున్న లక్ష్మీ భవాని కీర్తి అనే విద్యార్థిని ఎలుకల దాడికి గురై గాయాలపాలైన ఘటనపై మంగళవారం నామ నాగేశ్వరరావు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని నామ డిమాండ్ చేశారు. గురుకుల హాస్టళ్లలో విద్యార్థులకు సరైన మౌలిక వసతులు, మంచి ఆహారం అందకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఎలుకలు కొరికి విద్యార్థులు ఆస్పత్రిపాలవడం అత్యంత బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల హాస్టళ్లలో శుభ్రత, ఆహారం నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచాలని, విద్యార్థుల కోసం పటిష్టమైన ఆరోగ్య భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.


Comments