జిల్లాస్థాయి పాలిటెక్నికల్ క్రీడల్లో సాయిస్ఫూర్తి విద్యార్థుల ప్రతిభ.!
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక.
సత్తుపల్లి, డిసెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక మండల పరిధిలోని బి.గంగారం గ్రామంలో స్వయంప్రతిపత్తి కలిగిన సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల పాలిటెక్నికల్ విభాగం విద్యార్థులు జిల్లాస్థాయి పాలిటెక్నికల్ క్రీడా పోటీల్లో విశేష ప్రతిభ కనబర్చి పలు విభాగాల్లో విజయాలు సాధించారు. కొత్తగూడెం రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల క్రీడా మైదానంలో జనవరి 19, 20 తేదీల్లో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా పది పాలిటెక్నికల్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో సాయిస్ఫూర్తి కళాశాల విద్యార్థులు వాలీబాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ విభాగాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి తెలిపారు.
సాధించిన విజయాలు: వాలీబాల్ విన్నర్స్, గర్ల్స్ వాలీబాల్ రన్నర్స్, బ్యాడ్మింటన్ బాయ్స్ డబుల్స్ రన్నర్స్, బ్యాడ్మింటన్ గర్ల్స్ సింగిల్స్ రన్నర్స్, బ్యాడ్మింటన్ గర్ల్స్ డబుల్స్ రన్నర్స్, లాంగ్ జంప్(గర్ల్స్) ద్వితీయ స్థానం, 200 మీటర్ల పరుగు(గర్ల్స్) ద్వితీయ స్థానం. వచ్చే నెలలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో వాలీబాల్ జట్టు పాల్గొననుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో నాలుగోసారి సాయిస్ఫూర్తి పాలిటెక్నికల్ విభాగం విద్యార్థులు విజయాలు సాధించడం గర్వకారణమన్నారు. రాష్ట్రస్థాయిలోనూ మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. క్రీడలతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి అలవర్చుకోవాలని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్డాక్టర్ షేక్ యాకూబ్, డిప్లొమా డీన్ తోమండ్రు రాంబాబు, విభాగాధిపతులు విద్యార్థులను అభినందించారు.
.


Comments