మల్కాజిగిరి సీనియర్ జర్నలిస్ట్ మండే సురేష్ కు టిడబ్ల్యూజేఎఫ్ ఘన నివాళులు
మల్కాజిగిరి, సెప్టెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు) :
మల్కాజిగిరి సర్కిల్ వినాయక్ నగర్ డివిజన్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మండే సురేష్ గురువారం రాత్రి గుండెపోటుతో మృతిచెందడం పట్ల పత్రికారంగం విషాదంలో మునిగిపోయింది. శుక్రవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యదర్శి షేక్ సలీమా, రాష్ట్ర కమిటీ సభ్యులు హరి ప్రసాద్, జిల్లా నాయకులు పబ్బు మల్లేష్ గౌడ్, మల్కాజిగిరి కార్యదర్శి సత్యం, సుధాకర్, సురేష్ సాగర్ తదితరులు సురేష్ భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పత్రికా రంగంలో సేవలందించిన ఆయన, స్థానిక సమస్యలను ప్రజా వేదికపైకి తీసుకువచ్చిన తీరు అమరమైనదని కొనియాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తిత్వం ఆయనదని గుర్తుచేశారు. ఆయన మరణం జర్నలిస్టు వర్గానికి భర్తీ కాని లోటని తెలిపారు.జిల్లా నాయకుడు పబ్బు మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ – “సురేష్ ఎల్లప్పుడూ మిత్ర సహృదయంతో మెలుగుతూ, సమాజ సమస్యలను అక్షరబాణాలతో ప్రతిబింబించేవారు” అని అన్నారు.మల్కాజిగిరి జర్నలిస్టులు ఆయన పత్రికా జీవితం, సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Comments