ఎల్కతుర్తి మండల టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
ఎల్కతుర్తి నవంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు)
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా ఫీజులను స్వయంగా భరించారు.
‘మోదీ గిఫ్ట్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన బండి సంజయ్, తన వేతన డబ్బులతో విద్యార్థుల పరీక్షా ఫీజు మొత్తాన్ని చెల్లించారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా పరిధిలోని ఎల్కతుర్తి మండల విద్యార్థుల ఫీజు మొత్తానికి సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్‌కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, గంగాడి కృష్ణారెడ్డి, ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి మాట్లాడుతూ —
“కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఈ ఏడాది పరీక్ష ఫీజును పూర్తిగా చెల్లించేందుకు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే లేఖలు పంపించారు,” అని తెలిపారు.
అతను ఇంకా మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో ఎక్కువమంది ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారే. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బండి సంజయ్ గారు ముందుకు రావడం అభినందనీయమైంది,” అన్నారు.మండల స్థాయిలో ఈ కార్యక్రమం పట్ల బీజేపీ కార్యకర్తలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.


Comments