మేమెంతో మాకు అంత రిజర్వేషన్లు… లేక ఉద్యమం యుద్ధమే
బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మేడల శ్రీనివాస్ సాగర్
మదనాపురం,నవంబర్24(తెలంగాణ ముచ్చట్లు):
బీసీల జనాభాకు సరిపడ రిజర్వేషన్లు కేటాయించాలని, లేకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ హెచ్చరించారు. వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు ఎవరిచ్చే బిక్షం కాదు… ఇవి మా హక్కులు అనే నినాదంతో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. వివిధ మండలాల బీసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ.. బీసీలను నమ్మించి మోసం చేయాలనే ప్రయత్నం ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదని, అలా జరిగితే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని స్పష్టం చేశారు. జీవో 46 ద్వారా బీసీల రాజకీయ ఎదుగుదలని నిరోధించాలన్న భావన ప్రభుత్వం చర్యల్లో కనిపిస్తోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాల్సిన అవసరం ఉందని, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్షంతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవాలనీ, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రధాని సమయం ఇవ్వకపోతే ఇండియా కూటమి తరఫున పార్లమెంట్‌ను స్తంభింపచేసే దిశగా కార్యాచరణను ప్రకటించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించడానికి ఎలాంటి అడ్డంకి లేదని, చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం వెంటనే అమలు చేయగలదని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు బీసీ ఉద్యమం ఆగదని చెప్పారు.కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ, బీసీల హక్కులను కోర్టులలో అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన రావాల్సిన సీట్ల బదులు నామమాత్ర కేటాయింపులతో అగ్రవర్ణాలను ముందుకు నెడుతున్నారని విమర్శించారు. భవిష్యత్తులో బీసీలు తమ గుణపాఠం తప్పకుండా చెప్తారని తెలిపారు.బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తమకు తగిన వాటా వచ్చేంత వరకు రాజీలేని పోరాటాన్ని కొనసాగించాలని పలువురు బీసీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ దేవరకద్ర నియోజకవర్గ కన్వీనర్ బి.శేఖర్, బీసీ కుల సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ జి.రాములు యాదవ్, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్, బీసీ సమాజ్ బూత్ పూర్ మండల కన్వీనర్ ఆంజనేయులు, గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఇన్‌చార్జ్ గంగాధర్ ముదిరాజ్, రవికుమార్, విజయ్‌కుమార్ రజక, రామకృష్ణ యాదవ్, శివశంకర్ యాదవ్, సోమశేఖర్ ముదిరాజ్, వినోద్, బలేమియా, అభి, దాసరి సంతోష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Comments