ఆపద కళాకారులకు చేయూత
--- 25 వేల ఆర్థిక సాయం,5 వేల నిత్యావసర సరుకులు
--- మానవత్వం చాటుకున్న అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు రమేష్ దంపతులు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులన్న సామెతకు నిలువుటద్దం ఈ కళాకారులకు చేయూత. కళాకారులుగా సుపరిచితులై, ఎన్టీఆర్ అభిమానిగా, కళాకారుడిగా మరణించిన ధరావత్ నరేష్, యాక్సిడెంట్ జరిగి బ్రెయిన్ సర్జరీ అయిన మరో రచయిత, కళాకారుడు రేలా నాగరాజు, మున్నేరు వరద ఉధృతిలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన గ్రానైట్ శిల్పి కళాకారుడు యన్నం ఉమేష్, వారి కుటుంబ సభ్యులకు ఆర్గాన్ యాడ్స్ అధినేత దండా లక్ష్మణరావు సహకారంతో అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు రమేష్ ఆయన భార్య శైలజతో కలసి 25వేల రూపాయలు, 5 వేల రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులను అందజేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు రమేష్ మాట్లాడుతూ... కళాకారులుగా కలసి పనిచేసి వారు ఆపదలో ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసిగా ఈ నేల మీద తిరిగాను, ఇక్కడి గాలి నీరు సేవించాను. నాకు ప్రాణం పోసిన ఈ ప్రాంతం వాసులు ఆపదలో ఉంటే ఎలా మర్చిపోగలనని అన్నారు. మిమిక్రీ కళాకారుడుగా పేదరికం నుండి అనేక కష్ట నష్టాలు చవిచూసి అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, ఇతర దేశాలలో మిమిక్రీ కళాకారుడుగా మంచి పేరు తెచ్చుకున్నానన్నారు. అమెరికాలోని 'సతీష్ దబ్బా' ద్వారా సహాయం అందించేందుకు వచ్చానన్నారు. మున్నేరు వరద బీభత్వానికి అనేకమంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్నేరు ఖమ్మం మీద పగ పట్టిందా అని చమత్కరించారు.
మెఫీ మానసిక వికలాంగుల కేంద్రంలో నిత్యావసర సరుకుల పంపిణీ
మెఫీ మానసిక వికలాంగుల కేంద్రంలోని 33మంది మానసిక వికలాంగులకు 5 వేలు విలువ చేసే నిత్యావసర సరుకులను మిమిక్రీ రమేష్, ఆయన భార్య శైలజ, దండా లక్ష్మణ్ రావు లు కలసి పంపిణీ చేశారు.


Comments