ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు సహకారించాలి
-స్తంభాధి గణేష్ ఉత్సవ కమిటీ, పీస్ కమిటీల సమన్వయ సమావేశంలో పోలీస్ కమిషనర్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని శాంతి సామరస్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసు కమిషనర్ సునీల్ దత్ సూచించారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ నవరాత్రుల ఉత్సవాల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
నగరంలోని సిక్వెల్ ఫంక్షన్ హల్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు ,పీస్ కమిటీలతో వినాయక నవరాత్రి విగ్రహాల ఏర్పాట్లు, బందోబస్తుపై పోలీసు కమిషనర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో జరుపుకొనే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. ప్రధానంగా మండపాల ఏర్పాటుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ముఖ్యంగా మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని, నిబంధనలను మండపం నిర్వాహకులు, కమిటీలు పాటించాలని సూచించారు. గణేష్ మండపంలో 24 గంటల పాటు విధిగా వాలంటీర్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలని, అంతే కాకుండా భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకుని మండపాలలో క్యూలైన్లను ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులు, కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలన్నారు. గణేష్ శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
*అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు..*
వినాయక ఉత్సవాల భద్రతకు సంబంధించి, పోలీసు, నగరపాలక సంస్థ , అగ్ని మాపక శాఖ, నీటి పారుదల శాఖ, వైద్య శాఖ, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి సమన్వయంగా పనిచేస్తూ, శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా జరుపుకునేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
*నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు..*
వినాయక నిమజ్జనోత్సవానికి జిల్లా పరిధిలో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. సెప్టెంబర్ 16 న జరిగే గణేష్ నిమజ్జనం కోసం భారీ పోలీసు బందోబస్తుతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్విమ్మర్స్, నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్, లైటింగ్స్, సీసీ టీవీ కెమెరాలు జిల్లా యంత్రాంగం
ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా చెరువులు, ఇతర నిమజ్జన నీటి కుంటల వద్ద వీధి దీపాలు, ఫ్లడ్ లైట్లు, అవసరమున్న మేర క్రేన్లను ఏర్పాటు చేయనున్నట్లు పెర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం గణేశ్ నిమజ్జనం జరిగే చెరువు కట్టల వద్ద విద్యుత్ లైట్లను, బారికేడ్లు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కొన్ని సమస్యలను సీపీ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన సీపీ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
*గణేష్ మండపాల నిర్వాహకులకు సూచనలు*
1) గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
2) రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేస్తున్నప్పుడు కమిటీ అధ్యక్షుడు/ కార్యదర్శి/ సభ్యులు/ నిర్వాహకుల పేర్లు మరియు సంప్రదింపు నంబర్లు పొందుపర్చాలి.
3) విగ్రహం ఏర్పాటు స్థలం ప్రైవేట్ వ్యక్తికి చెందినదైతే, సంబంధిత వ్యక్తుల నుండి ఎటువంటి అభ్యంతర లేదని ధృవీకరణ పత్రం పొందాలి.
4) నిర్వాహకులు "విగ్రహాలను రహదారిలో కాని వివాదాస్పద స్థలాల్లో ప్రతిష్టించవద్దని విజ్ఞప్తి.
5) ప్రధాన రహదారులపై మరియు ట్రాఫిక్ రద్దీగా వుండే రహదారులపై విగ్రహాలను ఏర్పాటు చేయరాదు.
6) పోలీసులకు సమర్పించేటప్పుడు విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి మరియు దానిని వారి దరఖాస్తులకు జతచేయాలి.
7) విద్యుత్ షార్ట్ సర్క్యూట్ నివారించేందుకు.నాణ్యమైన విద్యుత్ తీగలు మరియు పరికరాలు గణేష్ పండల వద్ద ఉపయోగించాలి.
8) మండపాల వద్ద డి జె లకు అనుమతి ఇవ్వబడదు,
రెండు మైక్ తో కూడిన స్పీకర్లు
(ధ్వని పరిమాణం తప్పనిసరిగా నాన్ డిస్ట్రబెన్స్ లెవెల్‌లో ఉండాలి) మాత్రమే అనుమతించబడతాయి.
అదేవిధంగా ఉదయం 6.00 నుండి రాత్రి 10.00 వరకు
సమయాలను అనుసరించి
మైక్ సౌండ్ సిస్టమ్ వినియోగించాలి.
9) గణేష్ మండపాల జియో ట్యాగింగ్ కోసం నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి
10) గణేష్ విగ్రహాల ఊరేగింపు సమయంలో అసౌకర్యాన్ని నివారించేందుకు నిర్వాహకులు చోరవ తీసుకోవాలని విజ్ఞప్తి.
11) నిర్వాహకులు వారి రోజు వారీ కార్యక్రమాలు, విగ్రహాలను నిమజ్జనం చేసే స్థలం మరియు మార్గాన్ని తప్పనిసరిగా సమర్పించాలి.
12) ఏదైనా పెద్ద కార్యక్రమం "అన్నదానం" మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల
ఏర్పాట్లు ఉంటే ముందుగా పోలీసులకు తెలియజేసినట్లయితే. పోలీసులు తగినంత బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు.
13) గణేష్ విగ్రహాల వద్ద నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు, కార్యక్రమాలు చేపట్టకూడదు.
14) విగ్రహాల దగ్గర మద్యం అమ్మకూడదు లేదా సేవించకూడదు.
15) విగ్రహాల వద్ద రాజకీయ ప్రసంగాలు అనుమతించబడవు.
17) ప్రతి గణేష్ మండపంలో ఇద్దరు సభ్యులు 24 గంటలు ఉండేలా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
18) ఏదైనా అవాంఛనీయ సంఘటనలు మరియు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా గణేష్ పండళ్ల చుట్టూ తిరుగుతుంటే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిర్వాహకులకు విజ్ఞప్తి.
19) ప్రతి గణేష్ మండపం వద్ద
నోటీసు బోర్డును,పాయింట్ బుక్ ఏర్పాటు చేసి
తప్పనిసరిగా నిర్వాహకుల సంప్రదింపు నంబర్లు మరియు వివరాలను పొందుపర్చాలి.
20) ప్రతి గణేష్ మండపం వద్ద తప్పనిసరిగా విద్యుత్ శాఖ మరియు పోలీసులు,
మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక శాఖ వంటి సంబంధిత అధికారులందరి సంప్రదింపు నంబర్‌లను అందుబాటులో వుంచాలి.
21) అగ్ని ప్రమాదాలను నివారించడానికి ప్రతి మండపం దగ్గర తప్పనిసరిగా ఫైర్ ప్రూఫ్‌గా ఉండేలా చూసుకోండి. తగినంత నీరు ఇసుక అందుబాటులో వుండాలి.
22) విగ్రహాల వద్ద దీపాలను వెలిగించేటప్పుడు అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా స్టీల్ ప్లేట్‌లో దీపాలు ఉండేలా నిర్వాహుకులు చూసుకోవాలి.
23) ఏలాంటి జంతువు కూడా మండపంల్లోకి ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
24) నిర్వాహకులు అపరిచితులను అనుమతించకూడదు. మరియు మండపంలోకి ఎలాంటి సామాన్లు లేదా పార్సెల్‌లను అనుమతించవద్దు. మరియు కార్లు/మోటార్ సైకిళ్లు/స్కూటర్/ఇతర వాహనాలను మండపం దగ్గరగా పార్కింగ్ చేయకూడదు..
25) ఆర్గనైజర్‌లు తప్పనిసరిగా తమ మండపం వద్ద సి సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
26) నిమజ్జనం కార్యక్రమానికి
పరిమిత సంఖ్యలోనే అనుమతించబడతారు.
27) ఊరేగింపు వాహనం ముందుగానే సిధ్ధం చేసుకోవాలి. వాహనం యొక్క డ్రైవర్ మద్యం సేవించకూడదు. సరైన డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి.
28) ఊరేగింపు రోజున నిర్వాహుకులు పోలీసులకు సహకరించాలి. ఊరేగింపులో ఉన్నప్పుడు మరియు నిమజ్జనం సమయంలో క్యూ లైన్‌ను పాటించాలి.
29) నిమజ్జనం జరిగే ప్రదేశాలలో పిల్లలు రాకుండా చూసుకోవాలి.
30) సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దు. అలాంటి ప్రచారాలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
31) సోషల్ మీడియాలో అసభ్యకరమైన మరియు మతపరమైన సందేశాల రూపంలో పుకార్లు వ్యాప్తి చేసే వ్యక్తులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
32) గణేష్ మండపాల వద్ద ఈవ్ టీజింగ్, రాజకీయ నినాదాలు లేకుండా చూసుకోవాలి.
సమావేశంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, ఏసీపీలు రమణమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,సాంబరాజు, సిఐలు ఉదయ్ కుమార్ , బాలకృష్ణ, రమేష్, భాను ప్రకాష్ , మోహన్ బాబు, సతీష్, కమిటీ సభ్యులు వినోద్ లాహుటి,జైపాల్ రెడ్డి, సుధాకర్, రామారావు , విద్యాసాగర్, పీస్ కమిటీ సభ్యులు హఫీజ్ జావిద్, ఆజీజ్, ఆషీఫ్, ఖాసీం, తౌఫిజ్ అహ్మద్, జామల్ పాషా తదితరులు పాల్గొన్నారు..


Comments